Begin typing your search above and press return to search.
బతికిపోయిన బడా కంపెనీ...
By: Tupaki Desk | 26 May 2015 4:54 AM GMTప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు సేవలే బెస్ట్ గురూ.. ప్రభుత్వ కంపెనీలన్నీ సతాయింపు సేవలే అందిస్తున్నాయి...అనుకుంటూ ప్రైవేటు సేవల వైపు ఆసక్తిచూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు అనేక ప్రభుత్వ కంపెనీలు ఉనికి కోల్పోయాయి. ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా దాదాపు ఇదే దశలో ఉండేది. అయితే తాజాగా ఆ కంపెనీకి కొత్త పథకం ఊపరిలూదింది.
దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ కనెక్షన్ల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. ఒక్క ఏపీ సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పరిధిలోనే సాలీనా లక్ష కనెక్షన్లను సంస్థ కోల్పోతోంది. ఇదే కొనసాగితే ల్యాండ్ లైన్ విభాగాన్ని మూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని గుర్తించిన సంస్థ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ''ఉచిత కాల్స్ '' పథకం ప్రారంభించింది. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ నుంచి ల్యాండ్‌లైన్, సెల్‌ఫోన్లకు అపరిమితంగా, ఉచితంగా మాట్లాడుకోవచ్చు. ఈ నెల 1వ తేదీన ప్రారంభించిన ఈ పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ పథకం ల్యాండ్‌లైన్ విభాగానికి ఊపిరి ఊదినట్లయిందని బీఎస్‌ఎన్‌ఎల్ వర్గాలు ఖుష్ అవుతున్నాయి. ఈ మేరకు లెక్కలు కూడా చెప్తున్నాయి. తొలి 25 రోజుల్లో సంస్థ ఏపీ సర్కిల్ పరిధిలో కొత్తగా 8,350 ల్యాండ్‌లైన్ కనెక్షన్లను పొందింది.
ఏప్రిల్‌లోని 25 రోజుల్లో సంస్థ పొందిన కనెక్షన్లు 4,500. ఆ నెలలో ఏకంగా 9 వేల కనెక్షన్లను సంస్థ కోల్పోయిందట. అయితే కొత్త పథకం కారణంగా మేలో 25 రోజులకు 8,350 కనెక్షన్లు నమోదైతే.. కోల్పోయింది 6 వేలు మాత్రమేనని వారు వివరించారు. నికరంగా 2,350 కనెక్షన్లు పెరిగాయని తేల్చారు. ఇలాంటి సానుకూల ఫలితాలను గడచిన ఐదేళ్లలో సంస్థ పొందలేకపోయిందని, కొత్త స్కీమ్ ఆపద్భాందవునిలా ఆదుకుందని చెప్తున్నారు. ఉచిత పథకం ఇచ్చిన ఉత్సాహంతో జూన్ నుంచి కనెక్షన్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించారు.