Begin typing your search above and press return to search.

అఖిలేశ్ సంచ‌ల‌న నిర్ణ‌యంతో మోడీషాల‌కు షాక్‌

By:  Tupaki Desk   |   11 Jun 2018 8:54 AM GMT
అఖిలేశ్ సంచ‌ల‌న నిర్ణ‌యంతో మోడీషాల‌కు షాక్‌
X
సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఏడాది కంటే త‌క్కువ‌కు వ‌చ్చేసిన నేప‌థ్యంలో రాజ‌కీయంగా ప‌లు ప‌రిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. మోడీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింప‌ట‌మే ల‌క్ష్యంగా పార్టీలు కొన్ని త‌మ‌కున్న రాజ‌కీయ విభేదాల్ని సైతం విస్మ‌రించి జ‌ట్టు క‌డుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇటీవ‌ల‌ యూపీలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీఎస్పీతో స‌మాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవ‌టం.. బీజేపీకి వ‌రుస షాకులు ఇవ్వ‌టం తెలిసిందే. రెండు బ‌ల‌మైన పార్టీలు క‌లిసి క‌ట్టుగా రంగంలోకి దిగ‌టం.. కాంగ్రెస్ స‌హ‌కారం తీసుకోవ‌టం ద్వారా అధికార బీజేపీ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయాల‌ని భావిస్తున్నారు.

ఇప్ప‌టికే స‌క్సెస్ అయిన ఫార్ములాను మ‌రింత క‌ట్టుదిట్టం చేసేందుకు అఖిలేశ్ యాద‌వ్ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. బీఎస్పీతో బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు వీలుగా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కొన్ని ఎంపీ స్థానాల్ని త్యాగం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అధికార బీజేపీని ఓడించేందుకు బీఎస్పీతో తాము సీట్లు స‌ర్దుబాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించారు.

మ‌యిన్ పూర్ లో జ‌రిగిన ర్యాలీలో ప్ర‌సంగించిన అఖిలేశ్‌.. బీఎస్పీతో త‌మ పొత్తు కొన‌సాగుతుంద‌ని.. 2019లో తాము కొన్ని సీట్లు వ‌దిలిపెట్టాల్సి వ‌చ్చినా అందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. బీజేపీని గ‌ద్దె దింప‌ట‌మే ల‌క్ష్యమ‌న్నారు. ప్ర‌పంచం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంద‌ని.. ఒక‌ప్పుడు పాక్.. చైనా మ‌న‌కంటే వెనుక‌బ‌డి ఉండేవ‌ని.. కానీ చైనా ఇప్పుడు మ‌న‌పై చాలా అధిక్యం సంపాదించింద‌న్నారు. త‌మ పొత్తుపై వ్యంగ్య వ్యాఖ్య‌లు చేస్తున్న బీజేపీ నేత‌ల తీరును అఖిలేశ్ త‌ప్పు ప‌ట్టారు. అఖిలేశ్ పొత్తు నిర్ణ‌యం.. సీట్ల త్యాగం కానీ వాస్త‌వ‌రూపం దాలిస్తే.. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ గడ్డు ప‌రిస్థితి ఎదుర్కొన‌టం ఖాయం.