Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి మాయావ‌తి రాజీనామా!

By:  Tupaki Desk   |   18 July 2017 1:24 PM GMT
రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి మాయావ‌తి రాజీనామా!
X
బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆమె తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ రోజు ఉద‌యం రాజ్యసభలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఉద‌యం స‌భ ప్రారంభ‌మ‌వ‌గానే ద‌ళితుల‌పై దాడుల గురించి మాట్లాడేందుకు మాయావ‌తి అనుమతి కోరారు. అనుమ‌తి ఇవ్వకపోతే పదవికి రాజీనామా చేస్తానంటూ హెచ్చ‌రించి సభ నుంచి వాకౌట్‌ చేశారు. అన్న మాట ప్ర‌కారం ఈ రోజు సాయంత్రం ఆమె త‌న‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ హ‌మీద్ అన్సారీకి ఆమె త‌న రాజీనామా లేఖ‌ను పంపారు.

త‌న‌కు రాజ్య‌స‌భ‌లో ద‌ళితుల‌పై దాడుల గురించి మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని మాయావ‌తి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌కు మాట్లాడే అవ‌కాశం లేన‌పుడు రాజీనామా చేయ‌డం త‌ప్ప వేరే మార్గం లేద‌న్నారు. స‌హ‌ర‌న్ పూర్ లో ప‌ర్య‌టించేందుకు త‌న‌కు అనుమ‌తి కూడా ఇవ్వ‌లేద‌ని ఆమె తెలిపారు. త‌న‌కు జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భద్ర‌త కూడా క‌ల్పించ‌డం లేద‌ని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండ‌డం వ‌ల్లే ఈ విధంగా జ‌రుగుతోంద‌న్నారు.

కాగా, ఈ రోజు ఉద‌యం రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్‌ పార్టీ రైతుల అంశంపై, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ భారత్‌-చైనా ప్రతిష్టంభనపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్‌ షహరాన్‌ పూర్‌ లో దళితులపై దాడి అంశాన్ని లేవనెత్తారు. కొద్ది రోజుల‌గా యూపీలోని స‌హ‌ర‌న్ పూర్ లో దళిత వర్గాలుపై జరుగుతోన్న దాడుల గురించి మాట్లాడేందుకు సమయం ఇవ్వాల‌ని మాయావ‌తి కోరారు. ఆమెకు డిప్యూటీ ఛైర్మన్‌ సమయం ఇవ్వ‌క‌పోవ‌డంతో మాయావ‌తి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

అయినా స‌మ‌యం ఇవ్వ‌క‌పోవ‌డంతో కోపోద్రిక్తురాలైన మాయావతి ‘ఇప్పుడు మాట్లాడేందుకు నన్ను అనుమతించండి. లేదంటే రాజీనామా సమర్పిస్తా’ అని అన్నారు. కీల‌క‌మైన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువచ్చేందుకు అవకాశం కల్పించ‌డం లేద‌న్నారు. ఆ త‌ర్వాత మాయావ‌తి సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న‌తో విప‌క్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మ‌రోవైపు, మాయావతి స‌భ‌కు క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ డిమాండ్‌ చేశారు. రాజ్య‌సభలో ఛైర్మన్‌కే సవాలు విసిరి అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపించారు. స‌భలో మాయావతి కీలకమైన విషయాలను చర్చించేందుకు సిద్ధమయ్యారని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. దళితులు, మైనార్టీలపై జరుగుతోన్న దాడుల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ రెండు వర్గాలు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయని ఏచూరి తెలిపారు.