Begin typing your search above and press return to search.

వామ్మో.. బీఎస్పీ టికెట్ రాలేదని ఇంతలా ఏడవటమా?

By:  Tupaki Desk   |   15 Jan 2022 5:30 AM GMT
వామ్మో.. బీఎస్పీ టికెట్ రాలేదని ఇంతలా ఏడవటమా?
X
యావత్ దేశం చూపు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మీద ఉంది. వచ్చే నెలలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఇలాంటివేళ.. యూపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక బీఎస్పీ (బహుజన్ సమాజ్ వాదీ పార్టీ) నేత.. తనకు పార్టీ టికెట్ ఇవ్వని వైనంపై భోరుమంటూ ఏడ్చేసిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది.

యూపీ ఎన్నికల్లో బీఎస్పీపై ఎలాంటి అంచనాలు లేవు. ఇప్పుడు పోటీ మొత్తం అధికార బీజేపీ వర్సెస్ అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ (సమాజ్ వాదీ పార్టీ) మధ్యనే నెలకొంది. ఇలాంటి వేళలో.. బీఎస్పీ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించటం.. పార్టీ ఇవ్వకపోవటంతో హతాశుడైన సదరు నేత భోరుమని విలపించటమే కాదు.. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరన్న విషయంలోకి వెళితే..

బీఎస్పీకి చెందిన అర్షద్ రాణా అనే నేత.. ముజఫర్ నగర్ లోని చార్తావల్ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ఆశించాడు. అందులో భాగంగా ఆయన పలు ప్రయత్నాలు చేశారు. పార్టీలో యాక్టివ్ గా ఉండే ఆయన.. తనతో పాటు తన భార్యను కూడా పార్టీ తరఫున పని చేస్తుంటారు. బీఎస్పీలో క్రియాశీలకంగా వ్యవహరించే తమకు..తప్పనిసరిగా పార్టీ టికెట్ ఇస్తుందని ఆశించారు. అందుకుభిన్నంగా వేరే అభ్యర్థిని బరిలోకి దించినట్లుగా బీఎస్పీ ప్రకటించటంతో అర్షద్ రాణా తీవ్ర నిరాశకు గురయ్యారు.

తాను టికెట్ కోసం రూ.67 లక్షలు ఇవ్వాలని పార్టీకి చెందిన నేత ఒకరు డిమాండ్ చేశారని.. ఇప్పటికే రూ.4.5 లక్షలు చెల్లించినట్లుచెప్పిన అర్షద్.. తనకు న్యాయం చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించటం గమనార్హం. టికెట్ రాని వైనం గురించి.. పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతూ.. భోరుమన్న వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఇతగాడి హడావుడి చూసినోళ్లు.. యూపీలో బీఎస్పీ టికెట్ కు ఇంత డిమాండ్ ఉందా? అని ముక్కున వేలేసుకునే పరిస్థితి.