Begin typing your search above and press return to search.

బంపర్​ ఆఫర్​.. 3 లక్షలకు బీటెక్​ సర్టిఫికెట్​..!

By:  Tupaki Desk   |   12 March 2021 2:30 AM GMT
బంపర్​ ఆఫర్​.. 3 లక్షలకు బీటెక్​ సర్టిఫికెట్​..!
X
ఇంజినీరింగ్​ చదవాలంటే ఎంసెట్​ రాయాలి.. ర్యాంక్​ తెచ్చుకోవాలి. ఆ తర్వాత కాలేజీలో చేరాలి. మళ్లీ పరీక్షలు రాయాలి. పాస్​ అయితే మన చేతికి సర్టిఫికెట్​ వస్తుంది. ఇంత తతంగం ఉంటుంది. కానీ ఇదేమీ అవసరం లేకుండానే కేవలం రూ. 3 లక్షలు ఇస్తే .. కొన్ని కాలేజీలు బీటెక్​ సర్టిఫికెట్​లు ఇస్తున్నాయి. హైదరాబాద్​ కేంద్రంగా ఈ దందా సాగుతున్నది. ఓ రాజకీయ నాయకుడికి చెందిన అటానమస్​ కళాశాలలో ఈ సర్టిఫికెట్ల వ్యాపారం సాగుతున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు.యూజీసీ నుంచి అటానమస్​ (స్వయం ప్రతిపత్తి) పొందిన కళాశాలలు సొంతంగానే పరీక్షలు నిర్వహించుకోవచ్చు.

జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో మొత్తం 35 ఇంజినీరింగ్‌ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి ఉంది. ఇక్కడ ఫలితాలు విడుదల చేసినప్పుడు మాత్రం జేఎన్​యూహెచ్​ నుంచి ఓ అధికారి వెళ్తారు. అయితే విద్యార్థులకు సంబంధించిన జాబితాను సంబంధిత కళాశాల జేఎన్​టీయూహెచ్​కు పంపిస్తుంది. దీంతో వాళ్లు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అయితే ఇదే అదనుగా చేసుకున్న కళాశాల యాజమాన్యం .. రూ. 3 లక్షలు తీసుకొని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. గతంలో కళాశాలలో ఒకటి రెండేళ్లు చదివి మానేసిన విద్యార్థుల వివరాలను మార్చి ఈ విధంగా అక్రమ దందాకు తెరలేపారు. అయితే ఇటీవల ఈ విషయంపై జేఎన్​టీయూహెచ్​ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఈ విషయంపై అధికారులు ఆరాతీస్తున్నారు.

ఈ విషయంపై ఇటీవల జేఎన్​టీయూహెచ్​కు చెందిన ఓ అధికారికి ఫిర్యాదు అందింది. దీంతో అతడు ఉన్నతాధికారులు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. అక్రమాలు జరిగేందుకు అవకాశం ఉందని జేఎన్​టీయూహెచ్​ అధికారులు అంటున్నారు. దీంతో ఇక నుంచి బీటెక్​ అడ్మిషన్లు మొదలైన వెంబడే వివరాలు తెలుసుకోవాలని భావించామని వాళ్లు అంటున్నారు.

అయితే సదరు కళాశాలలో ఇటువంటి అనేక అక్రమాలు జరుగుతున్నట్టు సమాచారం. గతంలో కొన్ని కళాశాలల్లో సెమిస్టర్​ ప్రశ్నాపత్రాలను కూడా ముందుగానే లీక్​ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అప్పట్లో జేఎన్​టీయూహెచ్​కు ఫిర్యాదు అందినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు హాజరుశాతం లేకపోయినా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ.. పరీక్షలకు అనుమతిస్తున్నట్టు సమాచారం. యూజీసీ అనుమతి ఉన్న కొన్ని కళాశాలలు బీటెక్​ సర్టిఫికెట్లను అమ్మేస్తూ అక్రమాలకు పాల్పడతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.