Begin typing your search above and press return to search.

జగన్ మీద పోటీకి దిగే అభ్యర్థిని డిసైడ్ చేసిన బాబు

By:  Tupaki Desk   |   23 Feb 2022 7:49 AM GMT
జగన్ మీద పోటీకి దిగే అభ్యర్థిని డిసైడ్ చేసిన బాబు
X
‘ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి’ అంటూ ఇటీవల కాలంలో వ్యాఖ్యలు చేస్తున్న ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు తగ్గట్లే ఆయన కూడా సిద్ధమవుతున్నారు. విపక్షంలో ఉండి కూడా తీరిక లేకుండా వ్యవహరించటం చంద్రబాబుకే చెల్లుతుంది. వరుస పెట్టి రివ్యూలు నిర్వహించటం.. పార్టీని చైతన్యపరిచేలా చర్యలు తీసుకోవటంతో పాటు.. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఇష్యూను తెర మీదకు తీసుకురావడం ద్వారా వార్తల్లో ఉండటమే కాదు.. అధికార పక్షంపై తరచూ యుద్ధం చేసేలా తన శ్రేణుల్ని సిద్ధం చేస్తుంటారు.

తాజాగా పులివెందుల టీడీపీ నేతలతో భేటీ అయిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసే రేసుగుర్రాన్ని రెఢీ చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరన్న విషయంపై స్పష్టత వచ్చేసినట్లే. గత ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసిన సతీష్ రెడ్డి.. ఓటమిపాలు కావటం.. పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవటం తెలిసిందే. తాజాగా చేసిన రివ్యూ లో పులివెందుల స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మూడేళ్ల జగన్ పాలనలో పులివెందులలో కూడా అధికార పార్టీ ప్రతిష్ట మసక బారిందని.. అధికార పార్టీ క్యాడర్ లో ఉత్సాహం తగ్గిందన్న ఆయన.. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలు నియోజకవర్గంలోని వైసీపీ నేతల్ని ఆత్మరక్షణలో పడేలా చేశాయని వ్యాఖ్యానించారు.

వైసీపీతో పాటు జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసిన వైఎస్ వివేకా హత్య నేపథ్యంలో.. పార్టీని బలోపేతం చేసే దిశగా పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నించాలన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సతీశ్ రెడ్డి అనంతరం పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోవటం.. అనంతరం పార్టీ ఇంచార్జి గా బీటెక్ రవికి అప్పగించారు. తాజాగా మాత్రం వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిగా బీటెక్ రవిని డిసైడ్ చేశారు.