Begin typing your search above and press return to search.

దేవి మర్డర్ మిస్టరీ వీడిపోయింది

By:  Tupaki Desk   |   8 May 2016 9:13 AM GMT
దేవి మర్డర్ మిస్టరీ వీడిపోయింది
X
సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఇంజినీరింగ్ విద్యార్థిని దేవి రెడ్డి మర్డర్ మిస్టరీ వీడిపోయినట్లు తెలుస్తోంది. దేవి తల్లిదండ్రులు అనుమానించినట్లు ఆమెది హత్య కాదని.. యాక్సిడెంట్ వల్లే ఆమె చనిపోయిందని పోలీసులు నిర్ధరించినట్లు సమాచారం. ఈ విషయం దేవి తల్లిదండ్రులకు కూడా స్పష్టం చేశారట. ఇందుకు తగ్గ ఆధారాలు కూడా చూపించారట. ఫోరెన్సిక్ నివేదకను క్షుణ్ణంగా అధ్యయం చేసిన అనంతరం.. దేవి ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడం వల్లే చనిపోయిందని నిర్దారించుకున్న పోలీసులు.. ఆమె తల్లిదండ్రుల్ని పిలిచి ఆ నివేదిక చూపించి వివరించడంతో వారు కూడా కన్విన్స్ అయినట్లు తెలుస్తోంది. దీంతో దేవిని హత్య చేసినట్లుగా అనుమానించిన ఆమె స్నేహితుడు భరత్ సింహా రెడ్డి ఈ కేసు నుంచి బయటపడ్డట్లే అన్నమాట.

పోలీసుల నివేదిక ప్రకారం దేవి తండ్రి నిరంజన్ రెడ్డి ఏప్రిల్ 30 రాత్రి 7.30 ప్రాంతంలో ఆమెను గచ్చిబౌలిలోని తన స్నేహితురాలు సోనాలి ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. ఆ తర్వాత 9.10 ప్రాంతంలో భరత్ సింహారెడ్డి తన చెవర్లే క్రూయిజ్ కారులో దేవిని.. సోనాలిని ఎక్కించుకుని గచ్చిబౌలి నుంచి బయల్దేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 దగ్గర వీళ్ల ముగ్గురి కామన్ ఫ్రెండ్ విశ్వనాథ్ కార్లోకి ఎక్కడా. ఇంకో ఇద్దరు కూడా వీరికి తోడయ్యారు.

అందరూ కలిసి గచ్చిబౌలిలోని బీట్స్ పర్ మినిట్ పబ్బులోకి రాత్రి 10 గంటల ప్రాంతంలో వెళ్లారు. అక్కడి నుంచి అర్ధరాత్రి దాటాక భరత్.. దేవి కలిసి కార్లో బయల్దేరాడు. తెల్లవారుజామున 3.51 ప్రాంతంలో భరత్-దేవి కార్లో హుడా కాలనీ రోడ్ నెం.70 మీదుగా వెళ్లినట్లు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. తాగిన మైకంలో భరత్ డ్రైవింగ్ మీద పట్టు కోల్పోయి ఓ చెట్టుకు ఢీకొట్టాడు. తీవ్ర గాయాలవడంతో దేవి ప్రాణాలు కోల్పోయింది. దేవికి పలు గాయాలు కావడం వల్లే ప్రాణాలు కోల్పోయిందని.. ఆమెపై లైంగిక దాడి జరిగిన దాఖలాలేమీ లేవని ఫోరెన్సిక్ నివేదిక ద్వారా వెల్లడవడంతో ఈ కేసుకు సంబంధించి మిస్టరీ వీడిపోయింది.