Begin typing your search above and press return to search.

టీడీపీలో ఇమడలేకపోతున్న ఆనం బ్రదర్స్..

By:  Tupaki Desk   |   8 Feb 2017 9:22 AM GMT
టీడీపీలో ఇమడలేకపోతున్న ఆనం బ్రదర్స్..
X
కాంగ్రెస్ లో మంచి బతుకు బతికి టీడీపీలోకి వచ్చాక సొంత ఊళ్లోనే మర్యాద దక్కక మథన పడుతున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్. తమ ఉనికి చాటుకునేందుకు వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీలో అవి సాగడం లేదు. ఆనం ఫ్యామిలీ మెంబర్స్ దూకుడు పెంచుతున్నారు. తాజాగా నెల్లూరు కార్పొరేషన్ వద్ద ఆనం వివేకా కుమారుడు హల్ చల్ చేశాడు. అది వీడియో సహితంగా చంద్రబాబు వద్ద కు చేరినట్లు టాక్.

ఆనం సోదరులను ఆత్మకూరు నియోజకవర్గానికి పరిమితం చేయాలన్నది చంద్రబాబు ప్లాన్.. చంద్రబాబు ఆంక్షలను దాటుకుని నెల్లూరులో తమ హవా చెలాయించాలన్నది ఆనం సోదరుల ఎత్తుగడ. దీంతో ఘర్షణ తప్పడం లేదు. తాజాగా మంగళవారం ఆనం వివేకా కుమారుడు రంగమయూర్ రెడ్డి రచ్చరచ్చ చేయడంతో వివాదం ముదిరింది. ఒక దశలో ఆనం కుమారుడు రంగమయూర్‌ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న చర్చ కూడా జరిగింది.

టీడీపీ నెల్లూరు జిల్లా పరిశీలకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి మంగళవారం నెల్లూరుకు వచ్చిన సమయంలోనే ఆనం వివేకా కుమారుడు ఆనం రంగమయూరిరెడ్డి… నెల్లూరు కార్పొరేషన్‌ కార్యాలయం వద్దకు వెళ్లి రచ్చ చేశారు. రుణాలు, పించన్ల పంపిణీ చేసే సూపరింటెండెంట్‌ పై మయూర్ రెడ్డి దాడికి ప్రయత్నించారు. ఆయనతో పాటు వచ్చిన అనుచరులు సూపరింటెండెంట్‌ ఫైళ్లు లాగిపడేశారు. వాటిని చించిపడేశారు. ఎవడెవడో చెబితే పించన్లు ఇచ్చేస్తారా అంటూ అధికారులను తిట్టిపోశారు. కార్పొరేషన్ కార్యాలయంలో రంగమయూర్ రెడ్డి చేసిన రగడను, తిట్టిన బూతులను కొందరు రహస్యంగా రికార్డు చేసి తీసుకెళ్లి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అప్పగించారు. దీంతో గోరంట్ల … మయూర్‌ రెడ్డిని పిలిపించుకుని వార్నింగ్ ఇచ్చారు. ఒక దశలో రంగమయూర్‌ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు గోరంట్ల ప్రతిపాదించారు. అయితే సస్పెండ్ చేస్తే దాన్ని ప్రతిపక్షం అవకాశంగా తీసుకుంటుందన్న ఉద్దేశంతో గోరంట్ల బుచ్చయ్యచౌదరి వెనక్కు తగ్గారట.

అయితే.. వీడియో తమ వద్దకు వచ్చింది కాబట్టి సరిపోయింది… ఇదే బయటకు వెళ్తే పార్టీ పరువు ఏమైపోవాలని గోరంట్ల మండిపడ్డారట. మరోవైపు గోరంట్ల అధ్యక్షతన జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడిన ఆనం రామనారాయణరెడ్డి … పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జిల్లా నేతలను సంప్రదించకుండా పట్టాభిరామిరెడ్డిని ప్రకటించినట్టు పత్రికల్లో చూసి తెలుసుకోవాల్సి వచ్చిందంటూ ఎత్తిపొడిచారు. మొత్తానికి ఆనంవారికి టీడీపీలో చాలా కష్టాలే ఎదురవుతున్నాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/