Begin typing your search above and press return to search.

గోరంట్ల క‌రివేపాకు అయిపోయార‌ట‌

By:  Tupaki Desk   |   21 Oct 2017 5:04 PM GMT
గోరంట్ల క‌రివేపాకు అయిపోయార‌ట‌
X
తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు టీడీపీని ప్రారంభించిన సమ‌యంలో ప‌చ్చ‌కండువా క‌ప్పుకొని...ఇప్ప‌టికీ టీడీపీలో ఉన్న సీనియ‌ర్ నేత‌ల సంఖ్య తక్కువ‌. అలా త‌క్కువ‌గా ఉన్న కొంద‌రి నేత‌ల్లో గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి ఒక‌రు. అలాంటి బుచ్చ‌య్య చౌద‌రి క‌రివేపాకు వ‌లే ప‌క్క‌న‌పెట్టేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగరంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు - గుడా ఛైర్మన్ గన్ని కృష్ణతో ద్విసభ్య కమిటీని ఏర్పాటుచేసి బాధ్యతలు అప్పగించడం పార్టీలో అలజడి రేకెత్తించింది. రాజమహేంద్రవరం నగరంలో జరిగే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు వీరిరువురికీ అప్పగిస్తూ మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ కేంద్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ - ఎమ్మెల్సీ వివివి చౌదరి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు నామన రాంబాబుకు ఉత్తర్వులు అందాయి. ఈ ఉత్తర్వులు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

వాస్తవానికి ఇంటింటికీ టిడిపి కార్యక్రమం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తోంది. ఇప్పటివరకు నగరంలో జరిగే కార్యక్రమానికి గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా విధిగా హాజరవుతున్నారు. నగరంలో డివిజన్ల వారీగా జరిగే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాల్లో ఇటు మేయర్ పంతం రజనీ శేషసాయి - ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి - ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు - గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ పాల్గొంటున్నారు. కానీ రోజువారీ షెడ్యూల్ సమాచారం మాత్రం ఇటు ఆదిరెడ్డి అప్పారావు కార్యాలయం నుంచి అటు గోరంట్ల బుచ్చయ్యచౌదరి కార్యాలయం నుంచి కూడా సమాచారం అందేది. గతంలో ఇటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ పరిస్థితిని బట్టే ద్విసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుందనే చర్చకూడా జరుగుతోంది. ఇటీవల జరిగిన పార్టీ సంస్థాగత కార్యవర్గంలో కూడా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించకపోవడం - ఇపుడేమో నగరంలో జరిగే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి సంబంధించి ద్విసభ్య కమిటీగా ఆదిరెడ్డికి - గన్నికి బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే గోరంట్లను రూరల్ నియోజకవర్గ ఇంటింటికీ టీడీపీకే పరిమితం చేసినట్టు స్పష్టమవుతోంది. ఈ పరిణామంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

మరో వైపు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటు నగర ఇంటింటికీ టీడీపీతో పాటు, అటు రూరల్ ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అదనపు బాధ్యతల వల్ల రూరల్ నియోజకవర్గానికి సంస్థాగత కార్యక్రమంలో న్యాయం జరగడంలేదనే భావం అధిష్టానానికి కలగడంవల్లే గోరంట్ల పూర్తిస్థాయిలో రూరల్ నియోజకవర్గంపై దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నుంచి ఇటువంటి ఆదేశాలు జారీఅయ్యాయని చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకే పార్టీ కేంద్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ - ఎమ్మెల్సీ వివివి చౌదరి ఈ ఉత్తర్వులు జారీచేసినట్టు సమాచారం. రాజమహేంద్రవరం నగరంలో టీడీపీలో దీపావళి సంద‌ర్భంగా పెద్ద బాంబు పేలినట్టయిందని అంటున్నారు.