Begin typing your search above and press return to search.
బాబు విమర్శలకు ఇది పరాకాష్ట
By: Tupaki Desk | 2 May 2018 11:40 AM GMTతెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం తమ నాయకుల తీరును చూసి సిగ్గుపడుతున్న సందర్భం..ఇంకా చెప్పాలంటే ఎందుకింత దిగజారారు అని చర్చించుకుంటున్న సందర్భం. అవకాశం దొరికితే చాలుఆ విమర్శలు చేయడంలో ముందుండే టీడీపీ నేతలు తాజాగా విపక్ష నేత వైఎస్ జగన్ కుటుంబంపై చేసిన తీరును చూసి ఆ పార్టీలోనే ఇలాంటి చర్చ జరుగుతోందని అంటున్నారు. ఇందుకు కారణం...తాజాగా జగన్ కుటుంబంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన విమర్శలే. ఇంతకీ ఆయనేమన్నారంటే..లిక్కర్ కింగ్, వేలకోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇంట్లో జగన్ కూతురు ఉందట. అక్కడి నుంచే ఆమె కాలేజీకి వెళుతోందట.
వైఎస్ జగన్ ను తమ ప్రత్యర్థిగా భావించే టీడీపీ ఆయనపై శృతిమించిన విమర్వలు ఎన్నో చేసిందని ఇప్పటికే రాజకీయ వర్గాలు సైతం పలు సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతెందుకు జగన్ ను తమ ప్రత్యర్థిగా భావించే కాంగ్రెస్ పార్టీ సైతం ఇటీవల టీడీపీని తన శైలి మార్చుకోవాలని సూచించింది. రాజకీయాలు మాట్లాడదాం - రాజకీయంగా విమర్శించుకుందాం, కానీ ఆడవాళ్ల జోలికి - చిన్న పిల్లల జోలికి వద్దు.. అని ఓ టీవీ చర్చల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు టీడీపీ నేతలను హెచ్చరించారు. అయితే కొద్దికాలం వరకు దాన్ని పాటించిన కాంగ్రెస్ నేతలు అనంతరం ఆ పద్దతిని అటక ఎక్కించారు.
తాజాగా టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ జగన్ పై విమర్శలు చేయడంలో ముందుండే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న శృతిమించిన విమర్శలు చేశారు. జగన్ పెద్ద కుమార్తె హర్షకు లండన్ నగరంలోని ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జి వర్సిటీలో సీటు వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడే ఆమె విద్యాభ్యాసం చేస్తోంది. అయితే ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా ఇంట్లో ఉండి జగన్ కూతురు చదువుకుంటోందని కామెంట్లు చేశారు. అయితే ఈ తీరును చూసి పలువురు టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఇదే రీతిలో చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.జగన్ ను విమర్శించాలంటే ఎన్ ఓ అంశాలున్నాయని పేర్కొంటూ ఇలాంటి మాటతీరు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.