Begin typing your search above and press return to search.

తమ్ముడు ఇదేం మాట.. జగన్ ఇంటి ముందు సూసైడ్ చేసుకోవటమా?

By:  Tupaki Desk   |   19 Aug 2019 7:09 AM GMT
తమ్ముడు ఇదేం మాట.. జగన్ ఇంటి ముందు సూసైడ్ చేసుకోవటమా?
X
రాజకీయాలన్నాక గెలుపోటములు మామూలే. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులకు ఇబ్బందికరంగా మారటం కొత్తేం కాదు. పవర్లో ఎవరున్నా.. పవర్ లేని పరిస్థితి కష్టంగా ఉంటుంది. అంత మాత్రానికే బెంబెలెత్తిపోయి.. ఎమోషనల్ బ్లాక్ మొయిల్ చేయటంలో అర్థం లేదు. తాజాగా టీడీపీ నేత కమ్ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బుద్ది లేని మాటలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. చంద్రబాబును హతమార్చేందుకు ఏపీలోని జగన్ సర్కారు ఒక పద్దతి ప్రకారం కుట్రలు.. కుతంత్రాలు చేస్తుందని వ్యాఖ్యానించటం చూస్తే.. నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని పరిస్థితి.

కృష్ణా వరదల కారణంగా ముంపు ప్రమాదం ఎదుర్కొంటున్న ప్రాంతాల్ని వదిలేసి కరకట్ట ప్రాంతంలోని బాబు నివాసం ఉన్న ఇంటి పరిసరాల్ని మాత్రమే డ్రోన్లతో చిత్రీకరించటం ఏమిటన్న ప్రశ్నను సంధించటం వరకూ ఓకే. ఆ మాత్రం దానికే.. బాబును పద్దతి ప్రకారం హతమార్చాలని ప్రయత్నిస్తుందన్న ఆరోపణలో ఏ మాత్రం అర్థం లేనిదన్న విషయాన్ని బుద్దా గుర్తిస్తే మంచిది. బాబు నివాసం వరద ముప్పు ఎదుర్కొంటుందా? లేదా? అన్న విషయాన్ని చూసేందుకు వెళ్లిన ఏపీ మంత్రుల్ని ఉద్దేశించి బుద్ధా చేసిన వ్యాఖ్యలు వింటే అవాక్కు అవ్వాల్సిందే.

చంద్రబాబు నివాసం వద్దకు ఏపీ మంత్రులు వెళ్లటాన్ని రెక్కీతో పోల్చటం చూస్తే.. తెలుగు తమ్ముడి మాటల్లో పస తగ్గి నస ఎక్కువైందన్న భావన కలగక మానదు. ఇందుకు బలం చేకూరేలా ఆయన సూసైడ్ స్టేట్ మెంట్ ఉందని చెప్పక తప్పదు. బాబు ఇంటి చుట్టూ నీళ్లు వచ్చినా ఏపీ ప్రభుత్వానికి ఏమీ పట్టలేదన్న మాటను తమ్ముళ్లు అనే ప్రమాదం ఉంది. అలాంటి ఆరోపణలు లేకుండా చేయటం కోసం చేసిన ప్రయత్నాన్ని తప్పు పట్టటమేకాదు..ఏపీ ముఖ్యమంత్రి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించటంలో అర్థం ఉందా? అన్నది ప్రశ్నగా మారింది.

రాజకీయాలన్నాక పోరాడాల్సిందే. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అంతేకానీ.. సవాళ్లను ఎదుర్కోవటం మానేసి.. అదే పనిగా ఎమోషనల్ బ్లాక్ మొయిల్ చేయటంలో అర్థం లేదన్నది మర్చిపోకూడదు. బుద్దా వెంకన్న లాంటి నేతలు ఆత్మహత్య లాంటి బుద్ధిలేని మాటలు మాట్లాడకుండా చంద్రబాబు చీవాట్లు పెట్టాల్సిందే. పోరాడేటోడికి ఎదురుదెబ్బలు తగిలినా.. ఏదో రోజున విజయం వరిస్తుంది. అందుకు భిన్నంగా ఎమోషనల్ బ్లాక్ మొయిల్ చేసే వాడికి ఏడుపు తప్పించి ఇంకేమీ మిగలదన్న సత్యాన్ని తెలుగు తమ్ముళ్లు గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.