Begin typing your search above and press return to search.

బుద్ధా వెంక‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యం... కేశినేని ఎఫెక్టే..!

By:  Tupaki Desk   |   3 Aug 2019 11:52 AM GMT
బుద్ధా వెంక‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యం... కేశినేని ఎఫెక్టే..!
X
ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత టీడీపీలో ఎక్క‌డిక‌క్క‌డ ముఠా కుమ్ములాట‌లు ఎక్కువ‌య్యాయి. నాయ‌కులు రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఎక్క‌డిక‌క్క‌డ రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం ఫైటింగ్‌కు దిగుతున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక కొద్ది రోజులుగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని వ‌ర్సెస్ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న మ‌ధ్య ఓ రేంజ్‌లో వార్ న‌డుస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా వీరిద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు. చివ‌ర‌కు పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవ‌డంతో వెంక‌న్న స్లో అయినా నాని మాత్రం త‌న సెటైర్లు ఆప‌లేదు.

ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న వీరిద్దరూ... ఆ తర్వాత బద్ధ శత్రువుల వల్లే ప్రవర్తించారు. నాని గ‌త ఎన్నిక‌ల‌కు ముందు విజ‌య‌వాడ లోక్‌స‌భ బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్పుడు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ వెంక‌న్న‌కు న‌గర పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు. ఆ త‌ర్వాత వీరి మ‌ధ్య గ్యాప్ రావ‌డంతో ఒక‌రిపై మ‌రొక‌రు సూటిపోటీ మాట‌ల‌తో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. తాజాగా... కేశినేని నాని కారణంగా... బుద్ధా వెంకన్న ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా శ‌నివారం కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడి హోదాలో పాల్గొన్న వెంక‌న్న ఇక‌పై తాను న‌గ‌ర పార్టీ అధ్య‌క్షుడిగా కొన‌సాగ‌న‌ని... చంద్ర‌బాబు త‌న స్థానంలో ఎవ‌రికి చోటు ఇచ్చినా వారికి స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పి స‌మావేశం మ‌ధ్య‌లోనే వెళ్లిపోయారు. దీంతో అక్క‌డున్న వారంతా షాక్ అయ్యారు. ఈ కీల‌క స‌మావేశానికి మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్ హాజ‌ర‌య్యారు.

అయితే ఇటీవ‌ల పార్టీలో అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తోన్న ఎంపీ కేశినేని నాని, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పలువురు ముఖ్యనేతలు డుమ్మా కొట్టారు. బుద్దా ఈ ప్రకటన చేసిన అనంతరం అందరూ కేశినేనితో జరిగిన మాటల యుద్ధం వ‌ల్లే బుద్ధా ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం వరకు బుద్దా నాలుగు పదవుల్లో ఉన్నారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, టీడీపీ అధికార ప్రతినిధి, అర్బన్ అధ్యక్షుడు హోదాలో ఉన్నారు. పార్టీ ఓడిపోయాక ఆయ‌న విప్ ప‌ద‌వి కోల్పోయారు. ఇక ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌ల విష‌యంలో నానితో ఏర్ప‌డిన అభిప్రాయ బేధాల వ‌ల్లే నాని వ‌ర్సెస్ వెంక‌న్న వార్ ముదిరి పాకాన ప‌డింది.