Begin typing your search above and press return to search.

'పద్మ' పురస్కారాన్ని తిరస్కరించిన మాజీ ముఖ్యమంత్రి

By:  Tupaki Desk   |   26 Jan 2022 4:35 AM GMT
పద్మ పురస్కారాన్ని తిరస్కరించిన మాజీ ముఖ్యమంత్రి
X
మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా రాజకీయ రంగానికి చెందిన వారికి దేశ అత్యుత్తమ పౌర పురస్కారాలు చాలా చాలా అరుదుగా లభిస్తుంటాయి. రాజకీయ రంగంలో ఎంత సేవ చేసినా.. మరెంత ముక్కుసూటిగా ఉన్నా వారికి పురస్కారాలు లభించటం ఉండదు. దీనికి కారణం.. పార్టీ ఏదైనా రాజకీయ వైరంతో పురస్కారాలు రాకుండా చేస్తారన్న అపవాదు ఉంది. అయితే.. మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఆ మరకను పోగొట్టుకునే ప్రయత్నమే చేసింది.

తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఒకే ఏడాది ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులకు లభించటం ఒక ఎత్తు అయితే.. ఆ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు మూడు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉండటం మరో విశేషంగా చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తొలిసారి ఒక కమ్యునిస్టు యోథుడు కమ్ పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బుద్ధదేవ్ భట్టాచార్యకు తాజాగా పద్మభూషణ్ ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. అనూహ్యంగా తనకు ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని బుద్దదేవ్ భట్టాచార్య తిరస్కరిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించటం షాకింగ్ గా మారింది.

పురస్కారం గురించి తనకేమీ తెలీదని.. తనకు ఒకవేళ పద్మభూషణ్ పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంటే మాత్రం తాను దాన్ని నిరాకరిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బుద్దదేవ్ భట్టాచార్య పదేళ్ల పాటు వ్యవహరించారు. కమ్యునిస్టు పార్టీ నేతగా.. నిలువెత్తు నిజాయితీకి నిదర్శనంగా ఆయన్ను అభివర్ణిస్తారు. అలాంటి నేతకు లభించిన పురస్కారాన్ని ఆయన వద్దనటం గమనార్హం.

కమ్యునిస్టులకు.. కమలనాథులకు అస్సలు పడదన్న మాటకు భిన్నంగా.. సైద్ధాంతిక విభేదాల్ని పక్కన పెట్టి.. నిజాయితీకి నిలువెత్తు రూపమైన రాజకీయ దిగ్గజానికి పురస్కారాన్ని ప్రకటించిన విషయంలో మోడీ సర్కారును అభినందించాల్సిందే. అయితే.. బెంగాలీల మనసుల్నిదోచుకోవటానికి విఫలయత్నం చేస్తున్న మోడీ పరివారం.. తాజా పద్మ పురస్కారంతో ఒక ప్రయత్నం చేశారన్న విమర్శను సోషల్ మీడియాలో కొందరు చేయటం గమనార్హం. ఈ వాదనలో వాస్తవం ఎంత ఉందన్నది పక్కన పెడితే.. రాజకీయ వైరాన్ని వదిలేసి.. గుణగణాల్ని పరిగణలోకి తీసుకొని పురస్కారాన్ని ప్రకటించేందుకు రికమెండ్ చేయటాన్ని మాత్రం అభినందించకుండా ఉండలేం.