Begin typing your search above and press return to search.

పేదలకు ఇళ్లు.. సర్కారు ఆపసోపాలు

By:  Tupaki Desk   |   31 Oct 2019 10:09 AM GMT
పేదలకు ఇళ్లు.. సర్కారు ఆపసోపాలు
X
ఏపీలో కనీసం ఉండడానికి సొంత ఇళ్లు కూడా లేదని.. తమకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య అక్షరాల 17,82,026 మంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 8,04,200 మంది - గ్రామాల్లో 9,77,826 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ పేదలందరికీ ఇళ్లు అనే పథకం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. గద్దెనెక్కాక నవరత్నాల హామీల్లో దాన్ని చేర్చారు. అయితే ఈ హామీని అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. కేవలం ఇళ్లు కట్టించడానికి భూసేకరణ కోసమే 11వేల కోట్లకు పైగా నిధులు అవసరమని ప్రభుత్వ వర్గాలు లెక్కతేల్చాయి. తొలుత 7వేల కోట్లు కావాలని రెవెన్యూశాఖ ప్రతిపాదించగా.. ఈ ఏడాది బడ్జెట్ లో రూ.5వేల కోట్లను వైసీపీ ప్రభుత్వం కేటాయించింది. ఇంకా 6వేల కోట్లు కావాలిప్పుడు.

అయితే భూసేకరణకే సర్కారుకు తలకుమించిన భారంగా మారడంతో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఈ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. ఇది ఫలితం ఇస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.

ఎంత ప్రయత్నించినా ఇప్పటిదాకా కేవలం 21262 ఎకరాల భూమి మాత్రమే రెవెన్యూశాఖ సేకరించింది. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరికీ ఇవ్వాలంటే ఏకంగా 45వేల ఎకరాలు కావాలి. దీంతో సగం కూడా సేకరణలో లభ్యం కాకపోవడం గమనార్హం.

ఏపీలో భూముల ధరలు కొన్ని జిల్లాల్లో ఆకాశాన్ని అంటడంతో వాటిని కొనడం సర్కారు భారంగా మారింది. తూర్పు గోదావరి జిల్లాలో ఏకంగా లబ్ధిదారులకు ఇళ్లు కట్టించడానికి భూమి కొనేందుకు 3,293 కోట్లు అత్యధికంగా వ్యయం అవుతోంది. ఇక కడపలో అత్యల్పంగా కేవలం 170 కోట్లకే భూమి దొరుకుతోంది. సర్కారు భూముల కోసం అన్వేషిస్తుంటే ఇదే అదునుగా భూముల రేట్లను పెంచేస్తున్నారట.. పట్టణాల్లో అయితే మరీ భారంగా తయారైందట.. దీంతో సర్కారు దాతలు - నాయకులు - పెద్ద మనుషులను భూసేకరణలో సాయం చేయాలని.. మీ భూములను ఇవ్వాలని వేడుకుంటోందట..