Begin typing your search above and press return to search.

విశాఖలో సీఎం కార్యాలయానికి బడ్జెట్ రెడీ?

By:  Tupaki Desk   |   1 Feb 2021 2:30 AM GMT
విశాఖలో సీఎం కార్యాలయానికి బడ్జెట్ రెడీ?
X
ఏపీ మూడు రాజధానులను స్పీడప్ చేశారు సీఎం జగన్. ఇప్పటికే కర్నూలుకు హైకోర్టును తరలించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్టు ప్రచారం సాగుతోంది.. కేంద్రానికి ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు సీఎం జగన్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అది త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. ఈ క్రమంలోనే విశాఖలో పరిపాలన రాజధానిని కూడా రెడీ చేస్తున్నట్టు అమరావతి వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

మూడు రాజధానులపై ఫోకస్ చేసిన సీఎం జగన్ విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మాణానికి ముమ్మర కసరత్తు చేస్తున్నట్టు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం కార్యాలయం బ్లూ ప్రింట్, డిజైన్లు సిద్ధం అయ్యాయని.. లేఔట్ ప్లాన్ కు కూడా ఆమోదం లభించిందని సమాచారం.

కాగా సీఎం క్యాంప్ కార్యాలయానికి రూ.113 కోట్లతో విశాఖ ఉడా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ప్రచారం సాగుతోంది. పనుల ప్రారంభానికి తక్షణమే రూ.16 కోట్లు ఇవ్వాలని అడగ్గా.. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

పరిపాలన కేంద్రం.. సీఎం క్యాంప్ ఆఫీస్.. సీఎం నివాసం ఎక్కడా అనే ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..తిమ్మాపురం గ్రేహౌండ్స్ స్థలంలో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు కానుందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడి గ్రౌహౌండ్స్ ఆనందపురానికి తరలించనున్నారు. అక్కడ 300 ఎకరాలను గ్రేహౌండ్స్ కు ప్రభుత్వం కేటాయించింది. తిమ్మాపురంలో ఇప్పటికే స్టేట్ గెస్ట్ హౌస్ పేరుతో నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది సీఎం క్యాంప్ కార్యాలయం అని అంటున్నారు.

ఇక సీఎం నివాసం రుషికొండపై ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. కొండపై ప్రస్తుతం పర్యాటక శాఖ అతిథి గృహాలు ఉన్నాయి. కొండపైన నివాసం వాస్తు, రాష్ట్రాభివృద్ధికి మేలు అని భావిస్తున్నారు.దీనిపై ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. అప్పటివరకు ఇవన్నీ ఊహాగానాలుగానే ప్రచారంలో ఉండనున్నాయి.