Begin typing your search above and press return to search.

కిర‌ణ్ రికార్డును అధిగ‌మించిన బాబు

By:  Tupaki Desk   |   30 Jan 2017 1:46 PM GMT
కిర‌ణ్ రికార్డును అధిగ‌మించిన బాబు
X
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రికార్డును ప్ర‌స్తుత‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క‌రోజులోనే అధిగ‌మించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జాపద్దుల క‌మిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇదెలా అంటే అంకెల గారడీతో మాయ చేయ‌డం ద్వారా. ఉమ్మ‌డి ఏపీ సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్క రోజులో రూ.6.50 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకుంటే...చంద్రబాబు ఒక్క రోజులో రూ.10.50 లక్షల కోట్ల ఎంఓయూలు చేసుకోవ‌డం ద్వారా కిరణ్ రికార్డును బాబు అధిగ‌మించార‌ని ఎద్దేవా చేశారు. బాబు ఒప్పందాల‌ను చూసిన వారికి ఈ దిమ్మ‌తిరిగే అభిప్రాయం క‌లుగుతోంద‌ని బుగ్గన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్టు ఏపీకి గతేడాది 4.5 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని 99 కోట్లు పెట్టుబడులు ఇప్పటికే వచ్చాయని చెప్పడాన్ని బుగ్గన తప్పుబట్టారు. కేవలం 11, 395 కోట్లు మాత్రమే వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయని ఆయన వెల్లడించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవడాన్ని బుగ్గన తప్పుబట్టారు. ఏపీకి వచ్చిన పెట్టుబడులపై సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ లెక్కలేన‌ని అన్నారు. రెండేళ్లలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ జరగడం లేదని ఈజ్‌ ఆఫ్‌ లైయింగ్‌ మాత్రమే జరుగుతోందని బుగ్గన ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా చేస్తున్న వరకు ఆయన హయాంలో జరిగిన అభివృద్ధిని గత కాంగ్రెస్‌ ప్రభుత్వం, వైఎస్‌ఆర్‌ హయాంతో పోల్చి లెక్కలతో సహా వివరించారు. వాస్తవాలకు బాబు చెప్పుకుంటున్న మాటలకు ఎక్కడా పొంతన లేదని నిరూపించారు. ఆయన చెప్పుకునే అభివృద్ధి కేవలం పేపర్లలోనే ఉందన్నారు. చంద్రబాబు ఇప్పటికే 13 సార్లు దావోస్‌ వెళ్లి ఏం సాధించారని బుగ్గన ప్రశ్నించారు. ప్రచారం పేరిట సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఒక్క పెద్ద పరిశ్రమైనా ఏపీకి వచ్చిందా.. ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం కల్పించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 జాతీయ పత్రికల్లో కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్నంత మాత్రాన పెట్టుబడులు వస్తాయనుకోవడం పొరపాటని హితవు పలికారు. దావోస్‌ పర్యటనలతో ఇప్పటికే వందల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం కావడమే తప్ప ఏం ఒరగబెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం దావోస్‌ వెళ్లకుండానే మీకంటే రెట్టింపు అభివృద్ధి సాధించారుగా అని ఎద్దేవా చేశారు. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రులు కరుణానిధి, జయలలితలు దావోస్‌ వెళ్లకుండానే వందల కిలోమీటర్ల పారిశ్రామిక కారిడార్‌లు తమిళనాడులో ఏర్పాటు చేసుకోలేదా అని ప్రశ్నించారు. బాబు పర్యటనలు, పేపర్‌ పబ్లిసిటీ మూలంగా వందల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పడమే ప్రతిపక్షం లక్ష్యమని తామూ అదేపని చేస్తున్నామని బుగ్గన పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/