Begin typing your search above and press return to search.

మొత్తం నాకించేసి..నంగ‌నాచి క‌బుర్లా..బాబుపై బుగ్గ‌న ఫైర్

By:  Tupaki Desk   |   23 Oct 2019 10:27 AM GMT
మొత్తం నాకించేసి..నంగ‌నాచి క‌బుర్లా..బాబుపై బుగ్గ‌న ఫైర్
X
’’అధికారంలో ఉన్న స‌మ‌యంలో మొత్తం ఏపీని నాకించేశారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామ‌ని చెబుతూనే అయిన వారికి దోచిపెట్టారు. ఇప్పుడు ఏమీ తెలియ‌ని నంగ‌నాచుల్లా మాట‌లు పేలుతున్నారు. బాబుకు ఏమాత్రం సిగ్గు లేదు‘‘ ఇది అని ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌ రెడ్డి చంద్రబాబుపై చేసిన విమర్శ. నిజానికి బుగ్గ‌న ఏం మాట్లాడినా.. మిగిలిన వారిమాదిరిగా ఉండ‌దు. అన్ని లెక్క‌లు చూసుకుని తూకం వేసిన‌ట్టు మాట్లాడ‌తారు. అలాంటి నాయ‌కుడు ఫైర్ అయ్యార‌ని అంటే.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఎంత స్ట్ర‌గుల్ ఫీల‌వుతోందో వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

క‌నీసం చిన్న చిన్న ఖ‌ర్చుల‌కు కూడా నిధులు విడుద‌ల చేయ‌డం మానేసి - దోచుకో దాచుకో అనే సూత్రాన్ని అవలంభించార‌ని - ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై అప్పుల కుప్ప‌లు మోపార‌ని బుగ్గ‌న చంద్ర‌బాబు నిర్వాకంపై మండిపడ్డారు. బుగ్గ‌న ఏమ‌న్నారంటే.. గత ప్రభుత్వం బడ్జెట్‌ ప్రకారం కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు నీతి ఆయోగ్‌ నివేదికలో రాష్ట్రం 10 వ ర్యాంక్‌ కు దిగజారింది. దీనికంతటికి కారణం గత ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 లక్షల 60 కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేసి.. వాటిని మాపై నెట్టి... మమ్మల్నే విమర్శిస్తున్నారు.

విద్యుత్‌ డిస్కంలను అపుడు నష్టాల్లోకి నెట్టారు. ఇపుడు విద్యుత్‌ను అధిక ధరకు కొన్నామని ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక నుంచి థర్మల్ విద్యుత్ కొనుగోలు కోసం 2018 అక్టోబర్‌ లో ఒప్పందం చేసుకున్నది టీడీపీ ప్రభుత్వమే. సౌర - పవన విద్యుత్‌ లు అన్ని సమయాల్లో రావని టీడీపీ నేతలకు తెలియదా అని బుగ్గన ప్రశ్నించారు. అదే విధంగా ఇసుక సమస్యకు చంద్రబాబు పాలనలో జరిగిన దోపిడే కారణమని విమర్శించారు. ప్రస్తుతం వర్షాలు - వరదలు ఎక్కువగా ఉండటం వలన కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు - యనమల - టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.

‘ఇండియా ఇండెక్స్ సర్వేలో రాష్ట్రాల పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. కొత్తదనం - వినూత్న ఆవిష్కార పరిస్థితులపై సర్వే చేశారు. ఈ ర్యాంకింగ్ ఇవ్వడమే మొదటి సారి. అలాంటపుడు ర్యాంక్ పడిపోవడం అనే చర్చకు తావేలేదు. మన రాష్ట్రంలో ఉన్న పరిజ్ఞానం అమలు చేసే విధానం లో వెనుకబడి ఉన్నామని చెప్పారు. పరిశ్రమకు మారే విషయంలో వెనుకబడ్డామని పేర్కొన్నారు. అసలు ఈ పరిస్థితికి చంద్రబాబు పాలన కారణం కాదా..?’ అని బుగ్గన ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో కాలేజీలు - యూనివర్సిటీలలో మౌలిక వసతుల కల్పన 3 నెలల్లో పూర్తవుతుందా..?

ఇన్నాళ్లు లక్షల కోట్లు పెట్టుబడులు - లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చెప్పారు. అదే నిజమైతే ఈ పరిస్థితి ఎందుకొస్తుంది? నిజానికి హైద్రాబాద్ లాంటి నగరం వలన తెలంగాణ మనకంటే ముందుంది. ఇక ఎస్‌ డీజీ సూచీలో ఆకలి లేకుండా ఉండాలన్న లక్ష్యంలో మనం 17వ స్థానంలో ఉన్నాం. ఆ లక్ష్యంలో ముందుండాలన్న లక్ష్యంతోనే నాణ్యమైన బియ్యాన్ని పేదలకు అందిస్తున్నాం. నీటి సరఫరా - పారిశుద్ధ్యంలో 16 వ స్థానంలో ఉన్నాం. అందుకే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ చేపడుతున్నాం. ఇక ఇండస్ట్రీ - ఇన్నోవేషన్‌ లో దేశంలో మనం 20 వ ర్యాంకులో ఉన్నాం. అందుకే క్లస్టర్ల ద్వారా పారిశ్రామిక వృద్ధి కోసం ప్రయత్నిస్తున్నాం’ అని ఆర్థిక మంత్రి వివరించారు. మొత్తంగా బుగ్గ‌న చేసిన విమ‌ర్శ‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి. లెక్కలతో సహా బాబుకి వెల్లడిస్తూ కౌంటర్ ఇచ్చారు బుగ్గన.