Begin typing your search above and press return to search.

బాబుని ఎడ్యుకేట్ చేస్తున్న బుగ్గన!

By:  Tupaki Desk   |   12 Sep 2016 4:19 AM GMT
బాబుని ఎడ్యుకేట్ చేస్తున్న బుగ్గన!
X
ప్రత్యేక హోదాపై ఇప్పటికే రకరకాలుగా మాటలు మారుస్తూ.. చివరకు హోదావల్ల కలిగే లాభాలేమిటో, వచ్చే ప్రయోజనాలేమితో చెప్పండి.. నన్ను ఎడ్యుకేట్ చేయండి అని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. సమాధానం చెబుతున్నారు వైకాలా పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఈ విషయంలో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల లిస్ట్ ఇది.. వీలైతే చంద్రబాబు ఈ విషయాలు తెలుసుకుని ఎడ్యుకేట్ అవ్వాలి అనే స్థాయిలో విడమరిచి చెప్పే ప్రయత్నం చేశారు బుగ్గన. ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ఎదురు ప్రశ్నిస్తున్న చంద్రబాబు కు... ఆ రాష్ట్రాల్లో ఎంత దుర్భరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయో తెలియదా? అని ప్రశ్నించిన బుగ్గన.. ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలను ఇలా చెప్పారు...

కేంద్రానికి ఆదాయపు పన్ను - సర్వీస్ ట్యాక్స్ - సెంట్రల్ ఎక్సైజ్ - కస్టమ్స్ సుంకాల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు 60 నుంచి 62శాతం ఆదాయాన్ని రాష్ట్రాలకు నిధులుగా ఇస్తుంది. అవి కాక గ్రాంట్లు - రుణాలు కూడా ప్రత్యేకంగా వస్తాయి. అత్యధిక సంఖ్యలో ఉండే మిగిలిన రాష్ట్రాలన్నిటికీ కలిపి 70శాతం ఉంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 30శాతం అందుతుంది. ఇవి కాకుండా.. హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే సహాయంలో 90శాతం గ్రాంటు రూపంలోనూ - 10శాతం రుణంగానూ ఉంటుంది. అయితే హోదాలేని రాష్ట్రాల విషయంలో ఇవి 30శాతం గ్రాంటు రూపంలోనూ - 70శాతం అప్పురూపంలోనూ ఉంటుంది. ఇదే క్రమంలో.. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు రావాలన్నా.. ప్రతీ ఏడాది లక్షల సంఖ్యలో కళాశాలల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులకు ఒక హోప్ కలిగించాలన్నా రాష్ట్రంలో కొత్త కొత్త పరిశ్రమలు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఎవరైనా ఇలా కొత్త పరిశ్రమలు పెడితే కేంద్ర ఎక్సైజ్ పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. ఇదే క్రమంలో నూటికి నూరు శాతం ఆదాయపుపన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు రూ. 100 కోట్ల పరిశ్రమ ఏడాదికి కోటి రూపాయల బీమా చేస్తే ఆ ప్రీమియం ఈ హోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు మొత్తం వెనక్కి ఇస్తారు. ఇదే క్రమంలో ఆయా రాష్ట్రాల్లోని పరిశ్రమలకు రవాణా సబ్సిడీ లభించడంతో పాటు ముడి సరుకుని తీసుకు వెళ్లేందుకు, తయారైన వస్తువులను తిరిగి పంపేందుకు అయ్యే రవాణా ఖర్చులను కూడా కేంద్రమే చెల్లిస్తుంది.

ఏది ఏమైనా.. ప్రత్యేక హోదా గురించి, దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తనను ఎడ్యుకేట్ చేయండి అని చెప్పిన చంద్రబాబుతో పాటు.. మాట మార్చిన బీజేపీ నేతలను - టీడీపీ ఎంపీలను కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎడ్యుకేట్ చేసినట్లేనని పలువురు భావిస్తున్నారు. నిత్యం హోదా కావాలి - హోదా కావాలి అని చెప్పడమే కాకుండా.. అసలు హోదా రావడం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు ప్రజలకు పూర్తిగా అర్ధమయ్యే రీతిలో ఇలా వివరంగా చెప్పడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.