Begin typing your search above and press return to search.

జగన్ బటన్ నొక్కాలంటే ఆయన ఉండాలట...?

By:  Tupaki Desk   |   9 April 2022 2:30 AM GMT
జగన్ బటన్ నొక్కాలంటే ఆయన ఉండాలట...?
X
మంత్రి పదవులు హోదాలతో పాటు బాధ్యత కూడా. కొందరికి లభించే శాఖలు వారి బాధలూ చూస్తే మాకొద్దీ శాఖలు అనుకుంటారు. అలా ఏపీలో ఒక కీలకమైన శాఖ పరిస్థితి ఉంది. దాని పేరే ఆర్ధిక శాఖ. ఆ శాఖ అంటే నంబర్ టూ గా చెబుతారు. ముఖ్యమంత్రి తరువాత స్థానం అది. ఇక అన్ని శాఖల మంత్రులు కూడా క్యూ కట్టేది ఈ శాఖ మంత్రి వద్దనే. ధనమూలం ఇదం జగత్ అని అంటారు. కాబట్టి ఇల్లు అయినా రాష్ట్రమైనా నడవాలీ అంటే సమర్ధుడైన ఆర్ధిక మంత్రి ఉండాలి.

ఇక విభజన ఏపీలో ఇద్దరు ఆర్ధిక మంత్రులను ఇంతదాకా చూశారు. మొదటి వారు యనమల రామక్రిష్ణుడు. ఆయన సీనియర్ మోస్ట్ నేత. పైగా విభజన తరువాత ఫస్ట్ చాన్స్ టీడీపీకి రావడం, కేంద్రంతో పొత్తులు ఉండడంతో యనమలకు ఆర్ధిక మంత్రిగా తొలి నాలుగేళ్ళూ కొంత రిలీఫ్ లభించిందని అంటారు. అయితే చివరలో మాత్రం ఆయన కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అవసరాలు, ఖర్చులు ఎక్కువ కావడం ఆదాయ మార్గాలు తగ్గిపోవడంతో ఆయన హయాంలో కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఆ విధంగా టీడీపీ సర్కార్ దిగిపోయేనాటికి ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉన్నాయని చెబుతారు. ఇక జగన్ క్యాబినేట్ లో ఆర్ధిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని తీసుకున్నారు. ఆయన అంతకు ముందు విపక్షంలో ఉన్నపుడు ప్రజా పద్దుల కమిటీకి చైర్మన్ గా పనిచేశారు. ఆర్ధిక వ్యవహారాల్లో ఆయనకు పట్టుంది.

మొత్తానికి ఆయన ఆర్ధిక మంత్రిగా మూడేళ్ల పాటు ఏపీని ఎలా నడిపించారో ఆయనకూ దేవుడికే తెలియాలి అని అంటారు. ఆయన అప్పులు తేవడం, జగన్ బటన్ నొక్కి తాడేపల్లి నుంచి సంక్షేమ పధకాల లబ్దిదారుల ఖాతాలో వేయడం ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది. ఆయన గత కొంతకాలంగా ఢిల్లీలోనే ఉంటున్నారు. కేంద్ర మంత్రులతో టచ్ లో ఉంటూ ఆర్ధిక పరిస్థితులను వివరిస్తూ పరిస్థితిని సానుకూలం చేసుకుని వస్తున్నారు.

ఆయనకు అప్పుల మంత్రి అని పేరు కూడా పెట్టేశాయి విపక్షాలు. మొత్తానికి బుగ్గన ఏం చేస్తున్నారు అన్నది పక్కన పెడితే జగన్ మాత్రం సంక్షేమ క్యాలెండర్ ని తప్పకుండా చూస్తున్నారు. టైమ్ కి బటన్ నొక్కేసి డబ్బులు వేసే వెసులుబాటు జగన్ కి బుగ్గన ఇస్తున్నారు.

ఇపుడు ఆ శాఖ విషయంలో కూడా చర్చ సాగుతోంది. బుగ్గన్న కనుక తప్పుకుంటే చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు అని కూడా అంటున్నారు. పైగా అప్పులు తేవడం, ఏపీ ఆర్ధిక పరిస్థితులను తట్తుకోవడం అన్నది మాటలు కానే కాదు, దాంతో ఆ శాఖ విషయం బుగ్గనకే వదిలేయడం బెటర్ అన్న మాట వైసీపీలో ఉంది.

వచ్చేది ఎన్నికల సంవత్స‌రాలు. ఏ మాత్రం తేడా వచ్చినా బటన్ టైమ్ కి నొక్కకపోయినా ఇబ్బందే. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాంతో అన్ని విధాలుగా రాటుదేలిన బుగ్గనకే ఆ పోస్ట్ రిజర్వ్ చేయవచ్చు అని తాజాగా వినిపిస్తున్న పరిస్థితి.

ఆయన్ని కాదని వేరే వారికి శాఖ అప్పగిస్తే ఏపీ ఆర్ధిక పరిస్థితులు గాడిన పడేసేందుకు ఆయనకు చాలా టైమ్ పడుతుంది అంటున్నారు. పైగా అది ప్రయోగమే అని చెబుతున్నారు. సో వాటిని పక్కన పెట్టేసి బుగ్గనకే ఛాన్స్ ఇస్తారని భోగట్టా. ఈ విధంగా ఆయన సేఫ్ జోన్ లో ఉన్నారని తెలుస్తోంది. కొత్తగా మరో మారు ప్రమాణం చేసే పాత ఆర్ధిక మంత్రి ఆయనే అంటున్నారు.