Begin typing your search above and press return to search.

పెండింగ్ నిధుల‌పై ఏపీ ఫోక‌స్‌: ‌కేంద్ర‌మంత్రితో బుగ్గ‌న భేటి

By:  Tupaki Desk   |   10 July 2020 2:44 PM GMT
పెండింగ్ నిధుల‌పై ఏపీ ఫోక‌స్‌: ‌కేంద్ర‌మంత్రితో బుగ్గ‌న భేటి
X
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింది. న్యాయ‌ప‌రంగా రావాల్సిన నిధుల‌ను కేంద్రం నుంచి తెచ్చుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే శుక్ర‌వారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ తో స‌మావేశ‌మ‌య్యారు. ఆమెతో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కు సంబంధించిన పలు అంశాలను కేంద్రమంత్రికి వివ‌రించారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడా మంత్రి బుగ్గ క‌లిశారు.

నిర్మ‌లా సీతారామ‌న్‌ తో భేటీ అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు - వెనుకబడిన ప్రాంతాలకు నిధులు - విభజన చట్టంలోని అభివృద్ధి పథకాలకు నిధులు - పీడీఎస్ - జీఎస్టీ బకాయిల మంజూరు చేయాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరినట్లు వివ‌రించారు. ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రానికి అదనంగా నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన‌ట్లు తెలిపారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఇచ్చిన వివరణలు కేంద్రానికి ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. రూ.3,500 కోట్ల రీయంబర్స్‌మెంట్‌‌ చేయాల్సి ఉందని గుర్తుచేశారు. పోలవరం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రాజెక్టుకు ఖర్చుచేసి రీయింబర్స్‌మెంట్‌ అడుగుతోందని వివ‌రించారు. జీఎస్టీ బకాయిలు రూ.3,500 కోట్లు రావాలని చెప్పారు.

లాక్‌డౌన్ ప్ర‌భావంతో రాష్ట్రానికి ఏప్రిల్ - మే - జూన్ లో 40 శాతం ఆదాయం పడిపోయిందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రత్యేక హోదాను వదిలిపెట్టి ప్యాకేజీకి మార్చుకుందని.. ఆ ప్యాకేజీలో స్పష్టత లేక ఏపీ నిధులు అంటూ అయోమయాన్ని సృష్టించిందని వివ‌రించారు. ఈ విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌ను కోరుతోంది. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు అందిస్తే రాష్ట్రానికి ఆస‌రాగా ఉంటుంద‌ని కేంద్రాన్ని కోరిన‌ట్లు మంత్రి బుగ్గ‌న తెలిపారు.