Begin typing your search above and press return to search.

ఏపీ రాజధానిపై బుగ్గన కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   22 Nov 2019 5:50 AM GMT
ఏపీ రాజధానిపై బుగ్గన కీలక వ్యాఖ్యలు
X
ఏపీలోని జగన్ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటి? అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఏపీ రాజధాని విషయంపై గడిచిన కొద్దిరోజులుగా సాగుతున్న చర్చకు పుల్ స్టాప్ పెట్టేలా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నగర నిర్మాణంపై జగన్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఏం చేయాలనుకుంటుంది? లాంటి సందేహాలకు సమాధానాలు ఇచ్చేలా బుగ్గన వ్యాఖ్యలు ఉన్నాయి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నగరాన్ని నిర్మించే కన్నా.. సంక్షేమ పథకాలు అమలు చేయటం.. బలహీన వర్గాలకు దన్నుగా నిలవటంతో పాటు.. ఉపాధి అవకాశాల్ని పెంచటమే తమ లక్ష్యమన్న విషయాన్ని బుగ్గన చెప్పుకొచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన వివిధ అంశాల మీద జగన్ ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుంది? సర్కారు విజన్ ఏమిటన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. రాజధాని నిర్మాణం తమ ప్రాధాన్యత ఎంతమాత్రం కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు.

ఆ మాటకు వస్తే.. లక్షల కోట్లు ఖర్చు చేసి నగరాలు నిర్మించే స్థోమత తమ ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని తేల్చేశారు. దీంతో.. రాజధాని మీద జరుగుతున్న హాట్ చర్చకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర రాజధానిని లండన్ లా రూపొందిస్తామని ఒక ప్రభుత్వం చెబితే.. ఆ తర్వాతి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న ఆయన.. అమరావతిలో తాత్కాలిక ప్రభుత్వ భవనాలకు అడుగుకు రూ.పదివేల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.

రాష్ట్రంలో విద్య.. వైద్యం.. పరిశ్రమల ఏర్పాటు.. ఉద్యోగాల కల్పనతో పాటు ఎన్నికలవేళ ఇచ్చిన హామీల్ని అమలు చేయటం మీదనే తమ ఫోకస్ ఉంటుందన్న విషయాన్ని చెప్పారు. మేనిఫేస్టోలో ప్రకటించిన నవరత్నాల అమలే తమ ప్రాధామ్యాలని పేర్కొన్నారు. అడుక్కి రూ.10వేల మొత్తాన్ని వెచ్చింది కట్టిన తాత్కాలిక భవనాల్ని ఉద్దేశించి.. ఆవేమన్నా స్వర్గంలో కట్టారా? అని ఎద్దేవా చేశారు. రాజధానిపై చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేశారన్నారు.

బుగ్గన చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే..

% హైదరాబాద్‌ను 400 ఏళ్ల కిందట కులీకుతుబ్‌షా మొదలు పెడితే.. ఇప్పుడీ స్థితికి వచ్చింది. చెన్నై, ముంబై, న్యూయార్క్‌ వంటి నగరాలు అభివృద్ధి చెందడానికి ఎన్నేళ్లు పట్టింది? అలాంటిది హైదరాబాద్‌ తానే కట్టినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.

% బాబు మాటలే నిజమైతే.. కులీకుతుబ్‌షాతో పాటు ఆయన తర్వాతి పాలకులు ఏం చేశారు?

% రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్‌ ప్రభుత్వానికి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన ఒప్పందం లేదు.

% 2014-15లో రాష్ట్రానికి సొంత పన్ను ఆదాయం రూ.42,618కోట్లు.. 2015-16లో రూ.39,907కోట్లు.. 2016-17లో రూ.44,181కోట్లు ఆదాయం వచ్చింది. జీఎస్టీ తర్వాత అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ పన్ను ఆదాయం పెరిగింది.

% జీఎస్టీ అమలు తర్వాత రూ.49,486కోట్ల ఆదాయం వస్తే.. 2018-19లో రూ.58,031కోట్లు ఆదాయం వచ్చింది. ఆర్థిక మందగమనంతో అన్ని రాష్ట్రాల్లోలాగే ఏపీలో కూడా ఈసారి ఆదాయం మందగించింది.

% బాబు ప్రభుత్వ హయాంలో ఆదాయం పెరగటమే నిజమైతే.. రూ.97వేల కోట్లు ఉన్న అప్పును రూ.2.40లక్షల కోట్లకు ఎందుకు తీసుకెళ్లారు? టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయే నాటికి రూ.40వేల కోట్ల మేర బిల్లులు ఎందుకు పెండింగ్ లో ఉన్నట్లు?

% ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ఓ పెద్దస్కాం. ఆ డిజైన్ లో చాలా లోపాలు ఉన్నాయి. అందుకే నిలిపేశాం. పవన విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి 2017లో ఆగమేఘాలపై 41 కంపెనీలతో ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు? అది కూడా 25 ఏళ్లపాటు ఎందుకు కొనసాగిస్తారు? యూనిట్‌కు రూ.2.50కు వచ్చే విద్యుత్తును రూ.4.80కి ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?

% తెలంగాణ ప్రభుత్వం మాదిరే మేం కూడా ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా ఇసుక విక్రయాలు కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో మద్యం దుకాణాలను 20శాతానికి తగ్గించినా రెండు రకాల పన్నులు వేయడం వల్ల ఆదాయం తగ్గలేదు. 2018-19 అక్టోబరులో రూ. 13వేల కోట్ల ఆదాయం రాగా, ఈసారి కూడా ఇంతే ఆదాయం వచ్చింది.