Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల‌లో బుల్డోజ‌ర్ ఫార్ములా వ‌ర్కౌట్ అయ్యేనా ?

By:  Tupaki Desk   |   14 March 2022 4:16 AM GMT
తెలుగు రాష్ట్రాల‌లో బుల్డోజ‌ర్ ఫార్ములా వ‌ర్కౌట్ అయ్యేనా ?
X
యూపీలో బీజేపీ గెలిచిన త‌రువాత మిగ‌తా రాష్ట్రాల‌లో కూడా త‌న ప‌నిలో వేగం పెంచుకోవాల‌ని త‌ద్వారా మంచి ఫ‌లితాలు అందుకోవాల‌ని యోచిస్తోంది.ఇందుకు అనుగుణంగానే ప్రాంతీయ పార్టీల ఉనికి అన్న‌ది పూర్తిగా ప్ర‌శ్నార్థ‌కం చేయాల‌న్న యోచ‌న ఒక‌టి చేస్తోంది.

ఇప్ప‌టికే ఉత్తర ప్ర‌దేశ్ లో సైకిల్ పార్టీ (సమాజ్ వాదీ పార్టీ)ని తుక్కు తుక్కు చేసిన బీజేపీ ఇక‌పై అదే హ‌వాను తెలుగు రాష్ట్రాల‌కూ వ‌ర్తింపజేయాల‌ని ఉవ్విళ్లూరుతోంది.మ‌రోవైపు కేజ్రీ వాల్ లాంటి వారు త‌మ త‌రఫున రాజ‌కీయాల‌ను కూడా షురూ చేస్తున్నారు.

ఢిల్లీతో పాటు పంజాబ్ లో కూడా పాగా వేసిన కేజ్రీ వాల్ ఇక‌పై ఆంధ్రా రాజ‌కీయాల వైపు దృష్టి సారించ‌నున్నా రు. బీజేపీ చూపేంత దూకుడులో ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ లేకున్నా, ఇప్ప‌టికే జిల్లాల స్థాయిలోఇంఛార్జుల‌ను, గ్రామాల స్థాయిలో కాస్తో కూస్తో కార్యక‌ర్త‌ల‌ను క‌లిగి ఉంది.

బీజేపీ తో పోలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి అంత ఎక్కువ అధికార యావ లేకున్నా ఉన్నంత‌లో బాగానే ప‌నిచేయాల‌న్న త‌లంపు ఉంది. ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి ఎదిగేందుకు తాపత్ర‌య‌పడుతోంది.కానీ బీజేపీ మాత్రం ప్రాంతీయ పార్టీలు పూర్తిగా తుడుచుకు పెట్టుకుని పోవాల‌న్న ఆత్రంతోనే ప‌నిచేస్తుంది అన్న‌ది సుస్ప‌ష్టం.

ఓవిధంగా కుదిరితే వైసీపీలో కానీ టీడీపీలో కానీ చీలిక తీసుకువ‌చ్చి త‌ద్వారా ల‌బ్ధి సాధించాల‌ని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా కొత్త ప్రాంతీయ పార్టీల ఏర్పాటుపై శ్రద్ధ‌గా గ‌మ‌నిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల‌లో తాము పెద్ద‌గా ఆశించిన ఫ‌లితాలు అందుకోలేక పోయినా ఓట్లూ సీట్లూ రాజ‌కీయంలో నెగ్గుకురాలేక‌పోయినా ప్రాంతీయ పార్టీల ఉనికి క‌ల్లోల ప‌రిచే ప‌రిణామాల‌ను మాత్రం త‌న‌కు అనుగుణంగా వాడుకోవాల‌ని చూస్తోంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

ఆ దిశ‌గా రేప‌టి వేళ వైసీపీని అస్థిర ప‌రిచేందుకు ష‌ర్మిలతో క‌లిసి ఆంధ్రాలో ప‌నిచేసినా చేయ‌వ‌చ్చు. అదేవిధంగా కాపు సామాజిక‌వర్గం నుంచో లేదా ద‌ళిత సామాజిక‌వ‌ర్గం త‌ర‌ఫునో ఓ పార్టీ ఆరంభం అయ్యేందుకు తెర వెనుక స‌హ‌కారం అందించి రెండు ప్రాంతీయ పార్టీలనూ గంద‌ర‌గోళం చేయ‌నూవ‌చ్చు.

ఇంత‌టి స్థాయిలో చాతుర్యం ప్ర‌ద‌ర్శిస్తూ ఆప్ ప‌నిచేయ‌డం లేదు అన్న‌ది ఓ వాస్త‌వం. ఏవిధంగా చూసుకున్నా ప్రాంతీయ పార్టీలు భూ స్థాపితం అయితే బాగుంటుంద‌ని ఓ ద‌శ‌లో కాంగ్రెస్ కూడా అనుకుంది కానీ ఇవాళ ఆ పార్టీ ఉనికి అన్న‌దే లేకుండా పోతోంది. పోయింది కూడా ! రాజ‌కీయంలో వ్యూహాలు బాగుంటాయి కానీ అత్యాశ‌తో కూడిన కోరిక‌లే అన‌ర్థాల‌కు హేతువులు. అవే భ‌స్మాసుర హ‌స్తాలు కూడా !