Begin typing your search above and press return to search.

నాడు తాలిబన్లకు వ్యతిరేకం.. నేడు అనుకూలం

By:  Tupaki Desk   |   23 Aug 2021 11:30 PM GMT
నాడు తాలిబన్లకు వ్యతిరేకం.. నేడు అనుకూలం
X
ఆప్ఘనిస్తాన్ దేశంలో అశ్రఫ్ గనీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు తమ పాలన షురూ చేసిన సంగతి అందరికీ విదితమే. ఇక ఆ దేశంలో ఉండబోమంటూ దేశంలో ఉన్న పౌరులు పారిపోతున్నారు. కాగా, దేశంలో అరాచక పాలనకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశానికి చెందిన పలువురు మేధావులు, హక్కుల కార్యకర్తలు తాలిబన్ల పాలనను వ్యతిరేకిస్తున్నారు. ఇక ఆప్ఘన్ రాజకీయాల్లో ఇరవై ఏళ్ల నుంచి ఉంటున్న ఓ వ్యక్తి గతంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పని చేశాడు.

తాజాగా తాలిబన్లకు మద్దతు పలుకుతున్నాడు. ఆయనెవరంటే..‘ఆప్ఘనిస్తాన్ బుల్ డోజర్’గా పేరొందిన సదరు వ్యక్తి ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ వైపు లేడు ఇస్లామిక్ ఎమిరేట్స్ వైపునకు మళ్లాడు. అనగా ‘తాలిబన్ బుల్‌డోజర్‌’గా మారిపోయాడు సదరు వ్యక్తి. ఆప్ఘన్ ప్రజలు బుల్‌డోజర్ అని పిలుచుకునే గుల్ ఆఘా షేర్జాయ్ ప్రజెంట్ ప్లేట్ మార్చాడు. సీఐఏ మాజీ ఏజెంట్, వార్‌లార్డ్ అయిన గుల్ ఆఘా షేర్జాయ్ కాందహార్‌, నంగర్‌హార్ ప్రాంతాలకు గవర్నర్‌గా పని చేసి ప్రజల మెప్పు పొందాడు. 2001లో నాటో బలగాలకు నేతృత్వం వహించిన అగ్రరాజ్యం అమెరికా.. తాలిబాన్లను తరిమికొట్టడానికి ఆప్ఘనిస్తాన్ మీద దాడులు చేసినప్పుడు గుల్ ఆఘా షేర్జాయ్ అమెరికాకు మద్దతిచ్చి ప్రజల వైపున నిలిచాడు.

దక్షిణ ప్రావిన్స్ కాందహార్‌లో ఆయన సీఐఏతో కలిసి తాలిబాన్‌కు వ్యతిరేకంగా నిలిచి నికరంగా పోరాడాడు. కానీ, ఆయన ప్రస్తుతం తాలిబన్ల వైపునకు మళ్లాడు. తాలిబాన్ పట్ల విశ్వాసంతో ఉంటానని తాజాగా ప్రమాణం కూడా చేశాడు. ఇక గుల్ ఆఘా షేర్జాయ్ తమ ప్రభుత్వంలో భాగం అవుతున్నట్లు తాలిబన్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ఆప్ఘన్ బుల్ డోజర్ కాస్తా తాలిబన్ బుల్ డోజర్‌గా మారడం పట్ల ఆ దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుల్ ఆఘా షేర్జాయ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ప్రావిన్సుల్లో పర్యటించేవారు. ఆ నేపథ్యంలోనే ప్రజల సమస్యలు పరిష్కరించేవాడు.

రోడ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసేవాడు. ఇకపోతే మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ నెట్‌వర్క్ క్రియేషన్ పట్ల కూడా ఆయన శ్రద్ధ వహించేవాడు. అయితే, ఆయనకు బుల్ డోజర్ అనే పేరెలా వచ్చిందంటే.. గుల్ ఆఘా షేర్జాయ్‌కు ఓ ప్రైవేటు కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉండగా, దాని ద్వారా రోడ్లు వేయించేందుకు హెవీ వెహికల్స్ ఉపయోగించే వాడు. అలా గుల్ ఆఘా షేర్జాయ్ రోడ్ల నిర్మాణాలకుగాను పెద్ద పెద్ద వెహికల్స్ ఉపయోగించడం వల్ల ‘బుల్ డోజర్’ అనే పేరొచ్చినట్లు తెలుస్తోంది.అయితే, గుల్ ఆఘా షేర్జాయ్ కూడా తనను తానుగా బుల్‌డోజర్ అని చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాట పడేవారు కాదు.

ఇకపోతే ఆప్ఘనిస్తాన్‌లో 2014లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఆయన గుర్తు ‘బుల్ డోజరే’ కావడం గమనార్హం. కాగా, అప్పుడు ప్రజల పక్షాన ఉన్న గుల్ ఆఘా షేర్జాయ్ ఇప్పుడు తాలిబన్ల పక్షాన చేరిపోయాడు. తాలిబన్ నేతలు కూడా గుల్ ఆఘా షేర్జాయ్‌కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగ ఓ వీడియో విడుదల చేశారు. సదరు వీడియోలో గుల్ ఆఘా షేర్జాయ్‌ మాట్లాడుతూ ఇస్తామ్ ఎమిరేట్, అమీర్-ఉల్-మొమీనిన్ తరఫున ఆప్ఘనిస్తాన్‌ను నిర్మించే బుల్ డోజర్ అవుతానని పేర్కొనడం గమనార్హం.