Begin typing your search above and press return to search.

'బుల్లి యాప్' సూత్రధారి అరెస్టు..?: సంచలన కేసులో కీలక మలుపు

By:  Tupaki Desk   |   5 Jan 2022 8:30 AM GMT
బుల్లి యాప్ సూత్రధారి అరెస్టు..?: సంచలన కేసులో కీలక మలుపు
X
మహిళల ఆత్మగౌరవాన్ని ఆన్లైన్లో వేలానికి పెట్టిన ‘బుల్లి బాయ్’ ఉదంతం దేశ రాజధానిలో కలకలం రేపింది. ట్విట్టర్ ఖాతాలో యాక్టివ్ గా ఉండే ముస్లిం మహిళల చిత్రాలను అసభ్యకరంగా మార్చి యాప్లో వేలానికి పెట్టిన వ్యవహారం ఇటీవల బయటపడింది. ఓ ముస్లిం జర్నలిస్టు తన ఫొటోను అమ్మకానికి ఉంచారంటూ ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఉత్తరప్రదేశ్ కు చెందిన విశాల్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అతడిని సరైన రీతిలో విచారించగా 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్ పేరును బయటపెట్టాడు. దీంతో ఉత్తరాఖండ్ కు చెందిన ఆమెను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అమెను పలు కోణాల్లో పోలీసులు విచారించనున్నారు.

కాగా విశాల్, శ్వేతలు స్నేహితులుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో వీరిద్దరిని కలిపి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే శ్వేతను అరెస్టు చేసేందుకు వీలుగా ఉత్తరాఖండ్ కోర్టు ఆమెకు నాలుగు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. మరోవైపు విశాల్ ను ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటణ్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. దీంతో అతనికి ఈనెల 10 వరకు రిమాండ్ విధించారు. ఇక ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న శ్వేతాసింగ్ ‘బుల్లి యాప్’ రూపొందించడంలో కీలక పాత్ర వహించిందని భావిస్తున్నారు. ఈ యాప్ ఏర్పాటుకు ఆమె వివిధ అకౌంట్లను కలిగి ఉన్నట్లు గుర్తించారు.

ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే వంద మందికి పైగా ముస్లిం మహిళల ఫొటోలను అసభ్యంగా మార్పింగ్ చేసి బుల్లి బాయ్ అనే యాప్ లో అప్లోడ్ చేసి వేలానికి ఉంచిన విషయం తెలిసిందే. అయితే వారి ఉద్దేశం మైనార్టీ మహిళల్ని అవమానించడమేనని పోలీసులు భావిస్తున్నారు. విశాల్ ‘ఖాల్సా సుప్రిమసిస్ట్’ అనే పేరుతో ట్విట్టర్ ఖాతాను కలిగి ఉన్నాడు. మరికొన్ని నకిలీ ట్విట్టర్ ఖాతాలు సిక్కుల పేరుతో వాడినట్లు పోలీసులు గుర్తించారు. పంజాబ్లో మతపరమైన ఉద్రిక్తతలను రేపడానికి ఈ ఖాతాలను ఉపయోగించారా..? అన్న కోణంలో విచారిస్తున్నారు.

ఇప్పటికే ఈ కేసు విచారణ వేగవంతం చేయాలని జాతీయ మహిలా కమిషన్ లేఖను ఢిల్లీ పోలీసు కమిషనర్ కు అందించారు. ఈ యాప్ పై ప్రతిపక్షాల నాయకులు సీరియస్ అవుతున్నారు. మహిళలను అవమానించేలా ఇలాంటి దుశ్చర్యలను అడ్డుకోవడానికి అందరూ ఒక్క తాటిపైకి రావాలని ముక్తకంఠంతో పిలుపునిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో నేరస్తులకు సరైన శిక్షలు పడకపోవడం వల్లే దారుణాలు జరుగుతున్నాయని అంటున్నారు. బుల్లిబాయ్ యాప్ విషయంలో నేరస్తులకు కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. ఓ వర్గం మహిళలను టార్గెట్ చేసి యాప్ ను సృష్టించడంతో పాటు చాలా మంది మహిళల ఫొటోలను ఇందులో అప్లోడ్ చేశారు. రాజకీయంగా ఈ వ్యవహారం దూమారం లేపడంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్ కు చెందిన 19 ఏళ్ల యువతిని అరెస్టు చేయడంతో పాటు ఈ యాప్ సూత్రధారి అమెనని ప్రచారం జరుగుతోంది. అయితే యుతి మాత్రమే ఈ యాప్ ను రూపొందించారా..? ఆమె తో పాటు ఇంకెవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.