Begin typing your search above and press return to search.

బుల్లీ బాయ్ ప్రధాన నిందితుడి చావు తెలివితేటలు మామూలుగా లేవుగా?

By:  Tupaki Desk   |   7 Jan 2022 11:30 PM GMT
బుల్లీ బాయ్ ప్రధాన నిందితుడి చావు తెలివితేటలు మామూలుగా లేవుగా?
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బుల్లీ బాయ్ యాప్ ఉదంతంలో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణాయ్ ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఈ దరిద్రపుగొట్టు యాప్ కు సంబంధించిన ముఖ్యుల్లో వీడొకడు. వీడి వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. ముస్లిం మహిళల్ని టార్గెట్ చేస్తూ.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వారిని గుర్తించి.. వారి ముఖాల్ని మార్ఫింగ్ చేయటం.. దాని మీద దారుణ రీతిలో కామెంట్లు రాసి.. అమ్మకానికి పెట్టటం లాంటి ఛండాలాలు ఎన్నో దీని ద్వారా చేస్తారు.

ఈ యాప్ ను రూపొందించి.. నిర్వహిస్తున్న గ్యాంగ్ లో నీరజ్ కీలకమని భావిస్తున్నారు. ఇతడు భోపాల్ లోని వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్నట్లుగా గుర్తించారు. ఇతడ్ని అసోంలో అరెస్టు చేశారు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇదే కేసులో ఇంతకు ముందు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. అయితే.. వీరిద్దరి వయసు కూడా నీరజ్ వయసుకు దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు. అయితే.. తన కంటే ముందుగా అరెస్టు అయిన వారిని సేవ్ చేసేందుకు నీరజ్ చావు తెలివితేటల్ని ప్రదర్శించాడు. అయితే.. ఇతడి ముదురు ఆలోచనల్ని పసిగట్టిన పోలీసులు.. తప్పు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇప్పటికే తనకున్న సోషల్ మీడియా ఖాతాను డిలీట్ చేసి.. మరో ఖాతాను తయారు చేయటం ద్వారా.. బుల్లీబాయ్ యాప్ కు సంబంధించిన తానే కీలకమని.. పోలీసులు అంతకుముందు అరెస్టు చేసిన ఇద్దరు అమాయకులని.. వారిని సేవ్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే.. అతగాడు తన పాత ట్విటర్ ఖాతాను డిలీట్ చేసి.. కొత్త ఖాతాను క్రియేట్ చేసుకున్న విషయాన్ని గుర్తించి.. అతడి ఎత్తులు పారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త ట్విటర్ ఖాతాలో తానే అసలుసిసలు బుల్లీ బాయ్ యాప్ క్రియేటర్ గా పేర్కొన్నాడు. అయితే.. డిలీట్ చేసిన ఖాతా.. కొత్తగా తయారు చేసుకున్న ఖాతాలు రెండూ నీరజ్ బిష్ణోయ్ వేనన్న విషయాన్ని పోలీసులు గుర్తించి..అతడి ఎత్తులు పారకుండా చేశారు. ఈ ఇష్యూకు సంబంధించిన మరింత లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.