Begin typing your search above and press return to search.

'బుల్లీ బయ్'.. ఇద్దరు హైదరాబాద్ అమ్మాయిల్ని టార్గెట్ చేసింది

By:  Tupaki Desk   |   4 Jan 2022 6:30 AM GMT
బుల్లీ బయ్.. ఇద్దరు హైదరాబాద్ అమ్మాయిల్ని టార్గెట్ చేసింది
X
గడిచిన మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న బుల్లీ బయ్ కు సంబంధించిన మూలాల్ని వెతికేందుకు ఢిల్లీ పోలీసులు ఒక వైపు రంగంలోకి దిగారు. ఈ యాప్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని హోస్టింగ్ సేవలు అందించిన గిట్ హబ్ సంస్థను ఆదేశించారు. అంతేకాదు.. ఈ యాప్ కు సంబంధించిన సమాచారాన్ని ట్విటర్ లో ఎవరు తొలిసారి పోస్టు చేశారు? అసలు ఈ యాప్ గురించి వారికి ఆ సమాచారం ఎలా తెలిసింది? లాంటి అంశాల మీద ఆరా తీస్తున్నారు. దేశ వ్యాప్తంగా కలకలం రేపుతూ.. తీవ్ర విమర్శలకు దారి తీస్తున్న ఈ బుల్లీ బయ్ యాప్ తాజా బాధితులుగా ఇద్దరు హైదరాబాద్ అమ్మాయిలు ఉన్నట్లుగా గుర్తించారు.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ముస్లిం మహిళల ఫోటోల్ని ఈ యాప్ లో ఉంచి.. వాటిపై అసహ్యకరమైన రాతలు రాయటం.. వారిని వేలం వేస్తున్నట్లుగా చేసే అతి అంతా ఇంతా కాదు. ఈ యాప్ వ్యవహారాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదిలా ఉంటే.. తమకు తెలిసిన స్నేహితుల ద్వారా తమ ఫోటోల్ని ఈ యాప్ లో ఉన్నట్లుగా తెలుసుకున్నట్లుగా ఇద్దరు బాధిత మహిళలు హైదారబాద్ సైబర్ పోలీసుల్ని సంప్రదించారు.

వారిలో ఒకరు పాత్రికేయులు కాగా.. మరొకరు సామాజిక కార్యకర్తగా చెబుతున్నారు. వీరిద్దరి ఫోటోల్నియాప్ లో అప్ లోడ్ చేసిన గుర్తు తెలియని వారు.. వారి మీద అసహ్యకరమైన వ్యాఖ్యలు రాయటాన్ని గుర్తించారు. దీనికి సంబంధించిన ఆధారాల్ని పోలీసులు ఇచ్చి.. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇద్దరు ముస్లిం మహిళలు ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న సైబర్ పోలీసులు.. కేసు నమోదు చేసి.. విచారణ జరుపుతున్నారు. ఈ లెక్కన ఈ యాప్ లో మరెందరు అమాయక మహిళలు టార్గెట్ అయ్యారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యాప్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మజ్లిస్ అధినేత కమ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తున్నారు.