Begin typing your search above and press return to search.

‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   25 Aug 2021 3:30 PM GMT
‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్
X
సోషల్ మీడియాలో వైరల్ అయిన 'బుల్లెట్ బండి' పాటకు ఈ మధ్య పెళ్లి బరాత్ లో ఒక వధువు చేసిన డ్యాన్స్ వైరల్ అయ్యింది. వరుడి ముందు వధువు ఏమాత్రం భయపడకుండా అర్థవంతంగా చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసింది. తెలంగాణ యాసలో ఎంతో మధురంగా ఉన్న ఈ పాట సోషల్ మీడియాను ఊపు ఊపేసింది. ఆ డ్యాన్సింగ్ వీడియోతో సదురు వధువు ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.

తాజాగా ఆ వధువుకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఏ పాటకైతే డ్యాన్స్ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ తమ తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం ఆ యువతికి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకురాలు తాజాగా ప్రకటించారు.

మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీశాక ఉద్యోగి రాము-సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయ వివాహం తాజాగా రామకృష్ణాపూర్ కు చెందిన ఆకుల అశోక్ తో ఈనెల 14న జరిగింది. అప్పగింతల సమయంలో సాయిశ్రీయ ఏడవకుండా చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే యువతి డ్యాన్స్ చేసిన పాటను నిర్మించిన 'బ్లూరాబిట్ ' ఎంటర్ టైన్ మెంట్ సంస్థ తాజాగా ఈ వధువుకు మరో పాటలో అవకాశం ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

లక్ష్మణ్ రాసిన ఈ పాటకు ఎస్ కే బాజీ సంగీతం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించారు. ఈ పాటను నిర్మించిన బ్లూ రాబిట్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ తాజాగా వధువు సాయిశ్రీయకు మరో పాటలో అవకాశం కల్పించి ఫోన్ లో మాట్లాడారు. సాయిశ్రీయ కూడా మరో పాటలో డ్యాన్స్ చేసేందుకు అంగీకరించింది. త్వరలోనే ఈ పాట రూపొందించనుంది.'