Begin typing your search above and press return to search.

జగన్ కు బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   18 Oct 2021 5:10 AM GMT
జగన్ కు బంపర్ ఆఫర్
X
‘జగన్మోహన్ రెడ్డి ఎన్డీయేలో చేరాలి’ ఇది తాజాగా కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే చేసిన ప్రకటన. రాష్ట్ర పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి విశాఖపట్నంలో మాట్లాడుతూ జగన్ను ఎన్డీయేలో చేరాలంటూ ఆహ్వానించారు. జగన్ గనుక ఎన్డీయేలో చేరితే రాష్ట్రానికి జరగబోయే మేలు ఏమిటో కూడా చెప్పారు. రోడ్లు, టూరిజం, నీటిపారుదల ప్రాజెక్టులకు అత్యధిక నిధులు సాదించుకోవచ్చని అథవాలే చెప్పారు. ఇపుడు వైసీపీ ప్రభుత్వం పనితీరు బాగానే ఉందని జగన్ గనుక ఎన్డీయేలో చేరితే ఇంకా బాగుంటుందని కేంద్రమంత్రి జోస్యం చెప్పారు.

ఇదే సమయంలో మూడు రాజధానుల అంశానికి కేంద్రానికి ఏ మాత్రం సంబంధం లేదని కూడా తేల్చి చెప్పేశారు. సరే ఈ విషయాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్ల రూపంలో మూడు సార్లు హైకోర్టుకే స్పష్టంగా చెప్పేసింది. తన ఆఫర్ కు జగన్ గనుక ఓకే చెబితే ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేత జేపీ నడ్డాతో తానే మాట్లాడుతానని కూడా భరోసా ఇచ్చారు.

ఇంతకీ జగన్ను కేంద్రమంత్రి ఎందుకు ఆహ్వానించారంటే ఎన్డీయేని విస్తరించాలని మోడీ డిసైడ్ చేశారట. మరి ఎన్డీయేలోకి కొత్త పార్టీలను ఆహ్వానించాలని అనుకున్నారు కాబట్టే తాను జగన్ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఓకే కేంద్రమంత్రి లాజిక్ బాగానే ఉంది. కానీ జగన్ అందుకు అంగీకరించాలి కదా. ఎన్డీయేలో చేరితో ఏపీకి వచ్చే లాభం ఏమిటని జగన్ ఆలోచిస్తున్నట్లు ఎప్పటినుండో ప్రచారం అందరికీ తెలిసిందే. ఎన్డీయేలో చేరాలని గతంలో అమిత్ షా నే ఆహ్వానిస్తే జగన్ తిరస్కరించారని జరిగిన ప్రచారం అందరికీ తెలిసిందే.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు ఎన్డీయేలో చేరాలని చంద్రబాబునాయుడు తహతహలాడుతున్నారు. ఎవరు అడగకపోయినా ఎన్డీయే ప్రభుత్వానికి సహకారం అందించాలని పార్టీ మహానాడు లోనే తీర్మానం చేశారు. మోడీ కటాక్షం కోసం ఒక్క ఆరోపణ, విమర్శ కూడా చేయడం లేదు. కేంద్రం చేసిన తప్పులను కూడా జగన్ ఖాతాలో వేసి ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయాన్ని అందరూ గమనిస్తున్నదే.

ఒకవైపు ఎన్డీయేలో చేరటానికి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే మరోవైపు జగన్ను ఎన్డీయేలో చేరాలని కేంద్రమంత్రి ఆహ్వానించటం విచిత్రంగా ఉంది. అంటే కేంద్రమంత్రి తాజా ఆహ్వానాన్ని చూస్తే చంద్రబాబుకు ఎన్డీయేలోకి ఎంట్రీ దాదాపు లేదన్న విషయం అర్ధమైపోతోంది. ఏదో పార్టీతో పొత్తులేకుండా చంద్రబాబు ఒక్క ఎన్నికన కూడా ఫేస్ చేయలేరన్న విషయం అందరికీ తెలిసిందే. అందకనే వచ్చే ఎన్నికలనాటికి బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు తెగ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఎన్డీయేలోకి ఎవర వెళతారో చూడాల్సిందే.