Begin typing your search above and press return to search.

అఫిషియ‌ల్ః ఎన్‌ కౌంట‌ర్‌ పై స్పందించిన 'జ‌గ‌న్‌'

By:  Tupaki Desk   |   30 Oct 2016 9:15 AM GMT
అఫిషియ‌ల్ః ఎన్‌ కౌంట‌ర్‌ పై స్పందించిన జ‌గ‌న్‌
X
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో అక్టోబర్ 24న జంత్రిలో కేంద్రం - ఆంధ్ర - ఒడిశా ప్రభుత్వాలు జరిపిన సంయుక్త కోవర్ట్ దాడికి నిరసనగా తెలంగాణలో నవంబర్ 3న బంద్‌ లో పాటించాల‌ని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ కోరారు. ఈ మేర‌కు ఆయ‌న బ‌హిరంగ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు ఒడిశా సీఎంపై ఆయ‌న విరుచుకుప‌డ్డారు.

అక్టోబర్ 24 తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో సీపీఐ మావోయిస్టుకు చెందిన 27 మంది కామేడ్స్ అమరులవ‌డం నలభై యేళ్ల భారత విప్లవోద్యమ చరిత్రలో పెద్ద మొత్తంలో జ‌రిగిన మొట్ట‌మొద‌టి సంఘ‌ట‌న అని జ‌గ‌న్ పేర్కొన్నారు. ఏఓబీలో జ‌రిగిన మొద‌టి, ఆ త‌ర్వాతివ‌న్నీ బూటకపు ఎన్ కౌంటర్ హత్యలేన‌ని మండిప‌డ్డారు. ఇది ఖచ్చితంగా కోవర్డు కుట్ర అని పేర్కొంటూ పోలీసులకు లొంగిపోయిన వారిని కోవర్డులుగా మార్చుకుని ఒక పథకం ప్రకారం విప్లవకారుల్ని హత్య చేయడం గతం నుండి కొనసాగుతున్నదేన‌ని తెలిపారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిన "మేక్ ఇన్ ఇండియా" లాంటి పాలసీలు భారతదేశాన్ని లూటీ చేసి సామ్రాజ్యవాదులకు - బహుళ జాతి సంస్థలకు దోచి పెట్టడానికేన‌ని మండిప‌డ్డారు. మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ - మేక్ ఇన్ ఒడిస్సా పేర్లతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవే పథకాలను అమలు చేస్తున్నాయని జ‌గ‌న్‌ ఆరోపించారు.

ప్ర‌ధాన‌మంత్రి మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం - నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని ఒడిశా బీజేడీ ప్రభుత్వాలు తూర్పుకనుమల్లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా బాక్సైట్ గనులు తవ్వడానికి బరితెగిస్తున్నారని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఆంధ్రప్రదేశ్ - ఒడిశాలలో అత్యధిక ప్రమాణంలో బాక్సైట్ నిక్షేపాలున్నాయి. ఈ సంవత్సరం మార్చిలో కేంద్ర హెూం మంత్రి రాజ్ నాథ్ సింగ్ - విశాఖ పట్నం - కోరాపట్లలో పర్యటించిన తర్వాత ఈ ప్రాంతాల్లో నిర్బంధం తీవ్రతరమయ్యిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ - తూర్పుగోదావరి జిల్లాలలో వేలాది పోలీసు బలగాలతో ఏరియా డామినేషన్స్ కూంబింగ్ ఆపరేషన్లు - బూటకపు ఎదురుకాల్పులు జరపడం సర్వ సాధారణమై పోయిందని జ‌గ‌న్ మండిపడ్డారు. ఏఓబీ సంఘటన వలన త‌మ‌ పార్టీకి పెద్ద నష్టం జరిగిందని అయితే ఇటువంటి ఆటంకాలు త‌మ‌ పార్టీకి కొత్తవి కావ‌న్నారు. ఈ నష్టం నుండి తాము తొందరగానే బయట పడి తూర్పు కనుమల్లో ఉద్యమాన్ని పురోగమింపజేస్తామ‌న్నారు. ఈ కోవరు కుట్రకు పాల్పడ్డ అధికారుల మీద తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/