Begin typing your search above and press return to search.

ఇలాంటి ఘనత రిలయన్స్ కు మాత్రమే సొంతం

By:  Tupaki Desk   |   2 Dec 2022 3:19 AM GMT
ఇలాంటి ఘనత రిలయన్స్ కు మాత్రమే సొంతం
X
రిలయన్స్ కంపెనీ మరో ఘనతను సాధించింది. ఇప్పటికే ఈ కంపెనీ సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు. దేశంలో లక్షలాది కంపెనీలు ఉన్నా.. అత్యంత విలువైన కంపెనీగా పేరును సాధించటంరిలయన్స్ ప్రత్యేకతగా చెప్పాలి. దేశంలోనే అత్యంత విలువైన నమోదిక కంపెనీగా తాజాగా సిద్దం చేసిన ఒక జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంస్థ విలువ ఏకంగా రూ.17.5లక్షల కోట్లుగా అంచనా వేశారు.

బర్గండీ హురున్ ఇండియా 500 జాబితాలో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ నిలిచినట్లుగా ఇందులో పేర్కొన్నారు. ఈ నివేదికను యాక్సిస్ బ్యాంక్ తో కలిసి బర్గండీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించింది. రిలయన్స్ తర్వాతి స్థానంలో టీసీఎస్.. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్.. ఇన్ఫోసిస్.. ఐసీఐసీఐ బ్యాంక్.. భారతీ ఎయిర్ టెల్.. హెచ్ డీఎఫ్ సీ.. ఐటీసీ..అదానీ టోటల్ గ్యాస్.. అదానీ ఎంటర్ ప్రైజస్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో అదానీకి చెందిన రెండు సంస్థలు ఈఏడాది టాప్10 జాబితాలోకి రావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

ఈ టాప్ 10 కంపెనీల విలువ దగ్గర దగ్గర 72 లక్షల కోట్లకు పైనే ఉండటం గమనార్హం. అంతేకాదు జాబితాలో నిలిచిన టాప్ 500 కంపెనీల మొత్తం విలువ రూ.224 లక్షల కోట్లుగా అంచనా వేశారు. మొత్తం 73 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తున్నట్లుగా లెక్కలు వేశారు. ఈ జాబితాలో చోటు సంపాదించిన కంపెనీల ఆదాయం భారత జీడీపీలో 29 శాతానికి సమానంగా లెక్కేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ జాబితాలోని 500 కంపెనీలో 67 కంపెనీల్ని ఏర్పాటు చేసింది గడిచిన పదేళ్లలో కావటం మరో విశేషంగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక పరిణామాల నేపథ్యంలో జాబితాలోని కంపెనీలు గత ఏడాదితో పోలిస్తే రూ.1.78 లక్షల కోట్ల విలువను కోల్పోయినట్లుగా తేల్చారు. ఈ మొత్తం 500 కంపెనీల్లో 15 శాతం కంపెనీలు ఆర్థిక సేవల కంపెనీలు కావటం ఒక విశేషం అయితే.. అధిక శాతం ఆరోగ్య సంరక్షణ కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. వీటి తర్వాత రసాయనాలు.. వినియోగదారు వస్తు కంపెనీలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ఇక్కడే మరో అంశాన్ని చెప్పాలి. ఈ 500 కంపెనీల విలువను చూసి మనం మురిసిపోతున్నాం కదా. అయితే.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా చెప్పే యాపిల్ సంస్థ విలువ మొత్తం ఈ జాబితాలో ఉన్న 500 సంస్థలతో సమానమని చెప్పిన వైనం చూస్తే.. ఆ సంస్థ ఎంత పెద్దదన్న విషయం అర్థమవుతుంది.

ఇక.. స్టాక్ ఎక్సైంజ్ లో నమోదు కాని కంపెనీల్లో రూ.2.19 లక్షల కోట్ల విలువతో సీరమ్ ఇన్ స్టిట్యూబ్ అగ్రస్థానంలో నిలిస్తే.. తర్వాతి స్థానంలో బైజూస్ .. ఎన్ఎస్ ీలు నిలిచాయి. ఇక.. ఈ జాబితా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కంపెనీ బోర్డులో మహిళలు అత్యధికంగా ఉన్న కంపెనీలను చూస్తే.. అపోలో ఆసుపత్రి అగ్రస్థానంలో నిలిచింది. అపోలో బోర్డులో ఆరుగురు మహిళలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మిగిలిన ఏ కంపెనీ బోర్డులోనూ ఇంత మంది మహిళలు ఒక బోర్డులో లేరని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.