Begin typing your search above and press return to search.
బర్జ్ ఖలీఫా మీద త్రివర్ణ పతాక వెలుగులు..!
By: Tupaki Desk | 26 Jan 2017 4:30 AM GMTభారతదేశం 68వ గణతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటోంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది. రిపబ్లిక్ డే నాడు దేశరాజధాని ఢిల్లీలో జరిగే కార్యక్రమాలకు ప్రతీయేటా వివిధ దేశాల నుంచి అతిథుల్ని ఆహ్వానించడం మనకో ఆనవాయితీ. మన గణతంత్ర ఉత్సవాల్లో వారికీ భాగస్వామ్యం కల్పిస్తాం. ఈ ఏడాది జరుగుతున్న ఉత్సవాలకు అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్ ముఖ్య అతిథిగా వస్తున్న సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాలతో భారత సంబంధాలను మరింతగా పటిష్టం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన్ని ఆహ్వానించారు.
భారత గణతంత్ర వేడుకల సందర్భంగా దుబాయ్ లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన భవనం బుర్జ్ ఖలీఫా ఈ సందర్భంగా భారత జాతీయ పతాక రంగుల్ని అద్దుకుంది. అక్కడ బుధ, గురువారాల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. దుబాయ్ లోని భారత రాయభార కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా ఇండియన్ హై స్కూల్ విద్యార్థులు ఆజ్ కీ షామ్, దేశ్ కీ నామ్ పేరుతో సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు.
దుబాయ్ యువరాజు ఇండియాకు వస్తున్న సందర్భంలో 823 మీటర్ల ఎత్తున్న ఖలీఫా భవనంపై మూడు రంగులతోపాటు, అశోక చక్రాన్ని కూడా ప్రతిబింబించడం ప్రపంచదేశాలన్నింటికీ ఆకర్షించింది. దుబాయ్ లో ఉంటున్న భారతీయులందరూ ఈ దృశ్యాన్ని తిలకించి పులకించారు. భారత దేశం పట్ల తమకు ఉన్న ప్రేమాభిమానాలను దుబాయ్ ఈ విధంగా చాటుకుందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/