Begin typing your search above and press return to search.

బెంగ‌ళూరులో బ‌స్సు హైజాక్‌.. తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   29 April 2018 7:12 AM GMT
బెంగ‌ళూరులో బ‌స్సు హైజాక్‌.. తెలిస్తే షాకే
X
విమానాన్ని హైజాక్ చేయ‌టం విన్నాం. బ‌స్సుల్ని హైజాక్ చేసిన వైనాలు త‌క్కువే. సినిమాటిక్ గా సాగిన తాజా ఉదంతంలో బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రంలో ఒక ప్రైవేటు బ‌స్సును హైజాక్ చేయ‌టం.. ఒక గౌడ‌న్ లోకి తీసుకెళ్ల‌టం సంచ‌ల‌నంగా మారింది. ఒక‌ప్ర‌యాణికుడి ఫోన్ కాల్ పుణ్య‌మా అని వెంట‌నే స్పందించిన పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగ‌టంతో బ‌స్సు హైజాక్ ఉదంతం సుఖాంత‌మైంది.

బెంగ‌ళూరులోని క‌లాసిపాళ్య నుంచి కేర‌ళ‌లోని క‌న్నూరుకు 42 మంది ప్ర‌యాణికుల‌తో ఒక ప్రైవేటు బ‌స్సు బ‌య‌లుదేరింది. కాసేప‌టికే రెండు బైకుల మీద న‌లుగురు వ్య‌క్తులు బ‌స్సును వెంబ‌డించి.. రాజ‌రాజేశ్వ‌రి న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లిమిట్స్ లో బ‌స్సును అడ్డ‌గించారు. బ‌స్సులోకి ఎక్కిన వారు.. తాము సెంట్ర‌ల్ క్రైం బ్రాంచ్ పోలీసుల‌మ‌ని బెదిరించారు. డ్రైవ‌ర్ ను భ‌య‌పెట్టి తాము చెప్పిన రూట్లోకి తీసుకెళ్లాల‌ని ఆదేశించారు.

భ‌యానికి గురైన బ‌స్సు డ్రైవ‌ర్ బ‌స్సును ప‌ట్టాన్ గెరెలోని ఒక గౌడ‌న్ కు తీసుకెళ్లారు. ఇదిలా జ‌రుగుతున్న స‌మ‌యంలోనే బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న ప్యాసింజ‌ర్ ఒక‌రు పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి విష‌యాన్ని చెప్పారు. వెంట‌నే రియాక్ట్ అయిన పోలీసు సిబ్బంది 30 మందితో క‌లిసి ప్ర‌యాణికుల్ని.. బ‌స్సును ఉంచిన గౌడ‌న్ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నారు.

అనంత‌రం వారిని అదుపులోకి తీసుకోవ‌టంతో భ‌యాందోళ‌న‌ల‌కు గురైన ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. బ‌స్సును ఎందుకు హైజాక్ చేశార‌న్న అంశంపై పోలీసులు విచార‌ణ స్టార్ట్‌ చేశారు. కార‌ణం తెలిసి అవాక్కు అయ్యారు. బ‌స్సు ఓన‌ర్ లోన్ మీద బ‌స్సును కొనుగోలు చేశాడు. నెల‌స‌రిగా క‌ట్టాల్సిన వాయిదాల్ని స‌క్ర‌మంగా క‌ట్ట‌క‌పోవ‌టంతో స‌ద‌రు ఫైనాన్స్ కంపెనీకి చెందిన రిక‌వ‌రీ సిబ్బంది హైజాక్ ఎత్తుగ‌డ‌ను అమ‌లు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ప‌లువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వాయిదాల క‌ట్ట‌కుండా త‌ప్పించుకోవ‌టానికి మించిన త‌ప్పు బ‌స్సు హైజాక్ చేయ‌ట‌మ‌న్న చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిన‌ట్లు?