Begin typing your search above and press return to search.

పవన్, చంద్రబాబు పొత్తులో బిజినెస్ మ్యాన్

By:  Tupaki Desk   |   31 Jan 2019 10:59 AM GMT
పవన్, చంద్రబాబు పొత్తులో బిజినెస్ మ్యాన్
X
రాబోయే కీలకమైన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుల మధ్య చర్చలు సాధ్యమైనంత మేరకు ఫలప్రదం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.. ఎన్నికల్లో పోటీకి కలిసి కూటమి కట్టేందుకు ఇద్దరూ మొగ్గు చూపుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పవన్ , చంద్రబాబు ఇద్దరికీ బాగా దగ్గరైన ప్రముఖ వ్యాపారవేత్త ఈ ఇద్దరితో మధ్యవర్తిత్వం వహించి చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం.

మొదట్లో పవన్ ఒంటరిగా ఏపీ ఎన్నికల్లో దిగాలని యోచించారు. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదన్నాడు. అయితే చంద్రబాబు నాయుడు నుంచి తాజాగా వచ్చిన ఆఫర్ లాభదాయకమని పవన్ సన్నిహితులు ఒకటికి రెండు సార్లు ఆయన తో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జనసేనకు క్యాడర్, నాయకుల కొరత వేధిస్తోంది. టీడీపీతో కూటమి కడితేనే బెటర్ అన్న ఆలోచన జనసేనానిలోనూ వ్యక్తమవుతున్నట్టు సమాచారం.

జనసేన పార్టీకి 40 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు ఇస్తే టీడీపీ పొత్తుకు పవన్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ మాత్రం 30 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లకు మాత్రమే ఓకే చెబుతున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ఉండదని బహిరంగంగా ప్రకటించినప్పటికీ.. టీడీపీ ఇస్తున్న ఆఫర్ ను కొంచెం అటూ ఇటూగా ఆమోదించి పొత్తుతో వెళితేనే బెటర్ అన్న ఆలోచనలో జనసేన టీం ఉన్నట్టు సమాచారం.

మరో ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. జనసేనకు వైసీపీ అధినేత జగన్ 20 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్ల ఆఫర్ ఇచ్చాడని.. వైసీపీ నేత కన్నబాబు ఈ మేరకు మధ్యవర్తిత్వం వహించాడని ప్రచారం జరుగుతోంది. పవన్ ఇంత తక్కువ సీట్లకు ఒప్పుకోకుండా కమ్యూనిస్టులతో అన్ని సీట్లలో పోటీ చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం.

పవన్ ఆశించిన స్థానాలు కొంచెం అటూ ఇటూగా ఇప్పించడానికి సదురు వ్యాపారవేత్త టీడీపీతో చర్చలు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. దీంతో టీడీపీ-జనసేన పొత్తు పొడుపులు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.