Begin typing your search above and press return to search.

తిరుప‌తి నుంచి టీడీపీ బ‌రిలోకి దించ‌నున్న పారిశ్రామికవేత్త ఇతడే!

By:  Tupaki Desk   |   4 Aug 2022 8:00 AM GMT
తిరుప‌తి నుంచి టీడీపీ బ‌రిలోకి దించ‌నున్న పారిశ్రామికవేత్త ఇతడే!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయా పార్టీలు అప్పుడే అభ్య‌ర్థుల ఎంపిక పైన కూడా దృష్టి సారించేశాయి. తాజాగా తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ‌ను కాద‌ని ఈసారి టీడీపీ ఒక పారిశ్రామిక‌వేత్త‌ను బరిలోకి దించుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న జేబీ శ్రీనివాస్ అని, ఆయ‌న‌కు పరిశ్ర‌మ‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. బ‌లిజ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారేన‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం బ‌లిజ సామాజిక‌వ‌ర్గానికే చెందిన సుగుణ‌మ్మ టీడీపీ ఇన్‌చార్జుగా ఉన్నారు. ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీకి చెందిన‌ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ భూమ‌న కరుణాక‌ర్ రెడ్డే వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసే చాన్స్ ఉంది.

ఈ క్ర‌మంలో భూమ‌న‌లాంటి బ‌ల‌మైన అభ్య‌ర్థిని ఎదుర్కోవాలంటే అంగ‌, అర్థ బ‌లాలు పుష్క‌లంగా క‌లిగిన నేత అయితే బాగుంటుంద‌నేది టీడీపీ అధిష్టానం ఆలోచ‌న అని చెబుతున్నారు.

ప్ర‌స్తుత తిరుప‌తి టీడీపీ ఇన్‌చార్జ్ సుగుణ‌మ్మ అయితే భూమ‌నకు గ‌ట్టిపోటీ ఇవ్వ‌లేర‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ, తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ల్లోనూ, తాజాగా కొద్ది రోజుల క్రితం జ‌రిగిన టౌన్ బ్యాంక్ ఎన్నిక‌ల్లోనూ వైఎస్సార్సీపీ విజ‌య ఢంకా మోగించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో జేబీ శ్రీనివాస్ వ‌ద్ద‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని దూత‌గా పంపార‌ని అంటున్నారు. న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. జేబీ శ్రీనివాస్ కు చంద్ర‌బాబు చెప్పింది చెప్పార‌ని చెబుతున్నారు. దీనికి జేబీ శ్రీనివాస్ కూడా సిద్దంగా ఉన్నార‌ని స‌మాచారం. ఎంత డ‌బ్బైనా ఖ‌ర్చు పెడ‌తాన‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు తిరుప‌తి నుంచి ఈసారి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రంగంలోకి దిగుతార‌ని అంటున్నారు. అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసే జేబీ శ్రీనివాస్, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇద్ద‌రూ ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వార‌వుతార‌ని.. ముక్కోణ‌పు పోటీలో భూమ‌న క‌రుణాక‌ర్ విజ‌యం సాధిస్తార‌ని వైఎస్సార్సీపీ లెక్క‌లు వేసుకుంటోంద‌ని వార్త‌లు వస్తున్నాయి.