Begin typing your search above and press return to search.

బుచ్చయ్య సవాల్ వెనుక కారణం అదేనా?

By:  Tupaki Desk   |   18 July 2017 10:29 AM GMT
బుచ్చయ్య సవాల్ వెనుక కారణం అదేనా?
X
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చ పేరిట తెలుగుదేశం పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ లు సవాళ్లు విసురుకున్న సంగతి తెలిసిందే. విజయవాడ ప్రకాశం బ్యారేజీపై చర్చకు ఇద్దరూ రెడీ అయి ఈ రోజు అక్కడకు చేరుకోబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. బ్యారేజీపై చర్చకు అనుమతించాలని గోరంట్ల లిఖితపూర్వకంగా పోలీసులను కోరగా, అందుకు అనుమతించబోమంటూ ఆయనకు ఫ్యాక్స్ ద్వారా సమాచారాన్ని పంపించిన పోలీసులు, ఈ ఉదయం బ్యారేజీ వద్దకు బయలుదేరిన ఆయనను అడ్డుకున్నారు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడకు చేరుకుని, బ్యారేజ్ వద్దకు రాగా, ఆయన్ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా పోలీసులు మోహరించి ఇరువర్గాలు అక్కడికి రాకుండా కాపలా కాస్తున్నాయి.

ఇదంతా ఎలా ఉన్నా బుచ్చయ్య చౌదరి ఇంతగా సవాల్ విసరడం.. చర్చ కోసం ఉండవల్లిని రెచ్చగొట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. మూడు నెలల కిందట ఏకంగా చంద్రబాబుకే హెచ్చరికలు జారీ చేసి పార్టీ పదవులకు రాజీనామా కూడా సమర్పించిన బుచ్చయ్య చౌదరి ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకు దగ్గరయ్యేందుకే వడివడిగా పావులు కదుపుతున్నారని విశ్లేషిస్తున్నారు. పోలవరంపై చంద్రబాబు ఎంతగా సొంత డప్పు కొట్టుకుంటారో విపక్షాలు, కొందరు ఇతర పార్టీల నేతలు ఈ విషయంలో చంద్రబాబును అంతగా విమర్శిస్తుంటారు. అందుకే... పోలవరం విషయంలో తనపై ఎవరు ఆరోపణలుల చేసినా, దాన్ని బలంగా తిప్పికొట్టే టీడీపీ నేతలకు ఆయన ఫిదా అయిపోతుంటారు. ఆ సూక్ష్మాన్ని పసిగట్టే బుచ్చయ్య ఈ ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తోంది.

మొన్నటి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఆశించి భంగపడిన బుచ్చయ్య ఆ సమయంలో శివాలెత్తిపోయారు. ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు - సీనియర్ మంత్రులు ఎంతగా బుజ్జగించినా ఆయన కోపం తగ్గలేదు. చివరకు చంద్రబాబు నయానాభయానా నచ్చజెప్పగా సైలెంటయ్యారు. ఆ తరువాత ఇప్పట్లో ఇంకే పదవి రాదని తేలిపోవడంతో కనీసం మళ్లీ చంద్రబాబుకు దగ్గరైతే పొరపాటున వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే అప్పుడైనా మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఇలాంటి ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా టీడీపీలోనే వినిపిస్తోంది. సీనియర్ నేతగా, గోదావరి జిల్లాలవాసిగా ఆయనకు పోలవరం గురించి పూర్తిగా తెలుసని... పోలవరానికి ఎవరు ఏం చేశారో అన్నీ తెలిసి కూడా ఆయన చంద్రబాబు మెప్పుకోసమే ఇంత సీను క్రియేట్ చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.