Begin typing your search above and press return to search.

బుట్టా జంపింగ్‌ కు భారీ ప్యాకేజీ ?

By:  Tupaki Desk   |   14 Oct 2017 5:55 AM GMT
బుట్టా జంపింగ్‌ కు భారీ ప్యాకేజీ ?
X
చేతిలో ప‌వ‌ర్ ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు ఎన్ని మంచి ప‌నులు చేస్తే అంత‌గా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నిలిచిపోవ‌చ్చు. అందుకు భిన్నంగా.. ప్ర‌లోభాల‌తో మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా మారాల‌న్న చిత్ర‌మైన ఆలోచ‌న‌ను చేస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా త‌న‌దైన శైలిలో మ‌రో భారీ ప్ర‌లోభానికి తెర తీసిన‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి సంబంధించిన ముఖ్య‌నేత‌ల‌కు భారీగా ఎర‌వేసి.. వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్టీలో వ‌చ్చేలా చేస్తున్న వైనం గ‌తంలోనూ చోటు చేసుకున్న‌దే. సొంత పార్టీ నేత‌ల‌కు సంతృప్తిక‌ర‌మైన ప‌ద‌వులు ఇవ్వ‌ని చంద్ర‌బాబు.. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే వారికి పెద్ద‌పీట వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై సొంత పార్టీలో తీవ్ర అసంతృప్తి.. అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతున్న బాబు ప‌ట్టించుకోవ‌టం లేదు.

ఇప్ప‌టికే ప‌లువురు విప‌క్ష నేత‌ల్ని ప్ర‌లోభాల‌కు గురి చేసి ప‌చ్చ‌కండువా క‌ప్పుకునేలా చేసిన చంద్ర‌బాబు.. తాజాగా త‌న గురి క‌ర్నూలు ఎంపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బుట్టా రేణుక‌ను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌లో చంద్ర‌బాబుతో మీటింగ్ అయిన‌ట్లుగా స‌మాచారం.

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న త‌ర్వాత పార్టీ మారేందుకు ఫిక్స్ అయిన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర వేళ‌.. బుట్టాను పార్టీలోకి తీసుకెళ్ల‌టం ద్వారా ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చాల‌న్న భారీ ప్ర‌య‌త్నంలో బాబు అండ్ కో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

వ‌చ్చే నెల 2న పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర మీద ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. అధికార‌పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న త‌గ్గించేందుకు.. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకు.. జ‌గ‌న్ మీద విష ప్ర‌చారం చేసేందుకు వీలుగా బుట్టా రేణుక‌ను పార్టీలోకి తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా స‌మాచారం.

నిజానికి బుట్టా రేణుక‌ను ప‌లుమార్లు పార్టీలో చేర్చుకోవాల‌న్న ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ.. పార్టీ క్యాడ‌ర్‌.. అనుచ‌రుల నుంచి వెల్లువెత్తిన వ్య‌తిరేక‌త‌తో ఆమె వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా చెబుతున్నారు. రేణుక భ‌ర్త ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా.. సైకిల్ ఎక్కేందుకు బుట్టా ఓకే అంటే భారీ ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చేందుకు బాబు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన మూడు రోజుల‌కే క‌ర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్పీవై రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. విలువ‌ల గురించి మాట్లాడే ఎస్పీవై.. ఫ్యాన్ గుర్తుపై గెలిచారు. ఆ పార్టీని వ‌దిలి సైకిల్ ఎక్కిన‌ప్ప‌టికీ.. ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసింది లేదు.

ఇక‌.. తాజాగా క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక విష‌యానికి వ‌స్తే.. ఆమె టీడీపీలో చేర‌టం దాదాపు ఖ‌రారైంద‌ని చెబుతున్నారు. పార్టీ మారినందుకు ప్ర‌తిఫ‌లంగా దాదాపు రూ.70 నుంచి రూ.100 కోట్ల మేర కాంట్రాక్టుల‌ను ఇచ్చేందుకు బాబు అంగీక‌రించిన‌ట్లుగా చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం అభివృద్ధి కార్య‌క్ర‌మాల కోసం టీడీపీ అధినేత బాబు కుమారుడు లోకేశ్ ను క‌లిసిన బుట్టా.. పార్టీ మారే విష‌యంపై అధికార పార్టీ నుంచి వ‌చ్చిన ప్ర‌లోభానికి ఓకే అనేసిన‌ట్లుగా స‌మాచారం. బుట్టా పార్టీ మార‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.