Begin typing your search above and press return to search.

తట్టా.. 'బుట్టా'.. సర్దుకోవడమేనా?

By:  Tupaki Desk   |   29 Jan 2019 11:11 AM GMT
తట్టా.. బుట్టా.. సర్దుకోవడమేనా?
X
చేరే వారికి ఆశ చూపి అందలమెక్కించడం.. అవసరం తీరాక కూరలో కరివేపాకులా నాయకులను వదిలించుకోవడం బాబుకు ఆది నుంచి అలవాటేనని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుకదీ అలాంటి పరిస్థితే.. కర్నూలు పార్లమెంట్ సీటుపై ఆమె ఆశలు తలకిందులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఆయనకు బాబు కర్నూలు ఎంపీ టికెట్ హామీ ఇచ్చారని వార్తలొస్తున్నాయి. దీంతో తన పరిస్థితి ఏంటని బుట్టా రేణుక నేరుగా సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి అడిగినట్లు సమాచారం. ఇంకా సీట్ల విషయం ఖారారు కాలేదని పేర్కొన్న సీఎం.. వాటి గురించి తర్వాత మాట్లాడదామంటూ ముక్తసరిగా ఫోన్ సంభాషణ ముగించినట్టు సమాచారం. దీంతో బుట్టా రేణుక మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది.

పార్టీలో చేరినప్పుడు బుట్టా రేణుకకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎంపీ టికెట్ నీదేనంటూ బాబు ఆశ కల్పించారు. అప్పట్లో కర్నూలు పర్యటనలో లోకేష్ బాబు కూడా బుట్టాను ఎంపీగా తిరిగి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కోట్ల రాకతో ఓ బీసీ మహిళకు అన్యాయం చేస్తున్నారని ఆమె అనుయాయులు వాపోతున్నారు.

ఎంపీగా హామీ లేకపోయినా.. కనీసం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ కావాలని బుట్టా రేణుక అనుచరులు కోరుతున్నారు. కానీ లోకేష్ అండదండలు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కి ఉన్నాయంటున్నారు. దీంతో బుట్టా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందంటున్నారు.

కర్నూలులో ఆది నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలతో కోట్ల - కేఈ కుటుంబాల మధ్య వైరం కొనసాగింది. ఇరువర్గాల వారు ఫ్యాక్షన్ కు బలైపోయారు. కోట్లా చేరికను కేఈ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డిప్యూటీ సీఎం కేఈ ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. కోట్లకు సీటు ఇచ్చే విషయంలో బాబు హామీ ఇస్తే టీడీపీ లో మనస్పర్థలు బయటపడే చాన్స్ కనిపిస్తోంది.