Begin typing your search above and press return to search.

బయోపిక్ పై క్లారిటీ ఇచ్చేసిన గోల్డెన్ బాయ్..

By:  Tupaki Desk   |   10 Aug 2021 3:21 AM GMT
బయోపిక్ పై క్లారిటీ ఇచ్చేసిన గోల్డెన్ బాయ్..
X
ఇప్పుడు ఏ నోట విన్నా నీరజ్ చోప్రా మాటే. ఒలింపిక్స్ కు ముందు.. జరుగుతున్న వేళలోను ఆయన ప్రస్తావన.. ఆయన సాధించే పతకం గురించి ఎలాంటి చర్చ జరగలేదు. అందుకు భిన్నంగా స్వర్ణాన్ని సాధించిన ఆయన.. రాత్రికి రాత్రే సుపరిచితుడిగా మారిపోయారు. తన విశేష ప్రతిభతో అత్యుత్తమంగా రాణించిన ఆయన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. టోక్యో ఒలింపిక్స్ అతడ్ని గోల్డన్ బాయ్ గా మార్చేసింది. స్వర్ణం సాధించిన తర్వాత అతడి బయోపిక్ మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది.

త్వరలోనే నీరజ్ చోప్రా బయోపిక్ స్టార్ట్ అవుతుందన్న మాట సోసల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. స్వర్ణం సాధించిన అతడు.. తాజాగా స్వదేశానికి చేరుకున్నారు. అతడికి భారీ ఎత్తున స్వాగతం లభించింది. తన బయోపిక్ మీద జరుగుతున్న చర్చకు పుల్ స్టాప్ పెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దేశ క్రీడారంగంలో నూతన విప్లవానికి ఇది ప్రారంభం మాత్రమేనని.. త్వరలోనే మరెన్నో అద్భుతాలు చూస్తారంటూ అతడు పేర్కొన్నారు. తన బయోపిక్ ఇప్పుడే కాదన్నారు. కెరీర్ లో తాను సాధించాల్సినవి చాలానే ఉన్నాయన్నారు.

రిటైర్మెంట్ వరకు తనకు బయోపిక్ ఆలోచన లేదన్నారు. వచ్చే ఏడాది జరగనున్న కామన్ వెల్త్.. ఆసియా.. వరల్డ్ చాంపియన్ షిప్స్ పైనే తన ఫోకస్ అని చెప్పారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో భారత్ కు తొలి స్వర్ణాన్ని అందించినందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగిందన్నారు. ఒలింపిక్స్ ప్రధాన స్టేడియంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా జాతీయ గీతం వినిపిస్తుంటే గర్వంగా అనిపించిందని.. అప్పటివరకు పడిన శ్రమ.. కష్టం మొత్తం ఎగిరిపోయిందన్నారు.

అమ్మ చేతి వంట తిని చాలా రోజులైందన్న నీరజ్.. పతకం గెలిచిన పక్కరోజు తనకు చాలా ఆలసటగా అనిపించిందని.. ఒళ్లంతా ఒకటే నొప్పులుగా ఉన్నట్లు చెప్పారు. కానీ.. స్వర్ణం సాధించిన సంతోషంతో పెద్దగా బాధ పడలేదన్నారు. ఫైనల్ లో రెండో ప్రయత్నంలో 87.58 మీటర్ల దూరానికి విసరటంతో తనకు పతకం ఖాయమని అర్థమైందన్నారు. సో.. నీరజ్ బయోపిక్ గురించి ఆశలు పెట్టుకున్న వారికి మాత్రం తాజాగా ఆయన చెప్పిన మాట నిరాశను కలిగించటం ఖాయం.