Begin typing your search above and press return to search.

గోషామహల్ కి ఉప ఎన్నిక....రాజా సింగ్ ప్లాన్ ఏంటి...?

By:  Tupaki Desk   |   25 Aug 2022 11:30 AM GMT
గోషామహల్ కి ఉప ఎన్నిక....రాజా సింగ్ ప్లాన్ ఏంటి...?
X
తెలంగాణాలో ఇప్పటికే వరస ఉప ఎన్నికలతో జనాల మాట ఏమో కానీ రాజకీయ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అసలు ఉప ఎన్నికలకు తెర తీసి తన రాజకీయ లక్ష్యాన్ని చాలా సులువుగా చేరుకున్న వ్యూహకర్తగా కేసీయార్ ఎపుడూ ముందుంటారు. ఆయన తెలంగాణా ఉద్యమ పవర్ ఏంటో చూపించడానికి అప్పట్లో పదే పదే ఉప ఎన్నికలను తీసుకువచ్చేవారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని బీజేపీ కూడా అదే బాటలో నడుస్తూ కేసీయార్ కి చుక్కలు చూపిస్తోంది.

నిజానికి దుబ్బాక ఉప ఎన్నిక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల వచ్చింది కానీ హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు మాత్రం బీజేపీ ప్రేరేపితంగానే వచ్చాయి. ఇపుడు గోషామహల్ పేరు కూడా ఇందులో చేరుతుందా అన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది. గోషామహల్ నుంచి బీజేపీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా 2018లో గెలిచిన వారు రాజా సింగ్. అప్పట్లో చాలా సీట్లకు బీజేపీ పోటీ చేసినా డిపాజిట్లు గల్లంతు అయ్యాయి తప్ప ఓట్లూ సీట్లూ రాలేదు.

కానీ గోషామహల్ లో రాజాసింగ్ గెలిచి బీజేపీ వాణిని అసెంబ్లీలో తొలి మూడేళ్ళు వినిపించారు. ఆయన కరడు కట్టిన హిందూత్వ వాది. బీజేపీ లైన్ దాటి ఆయన ఎన్నో సార్లు తనదైన హిందూత్వ వాదన వినిపించారు. ఇపుడు ఆయన ఏకంగా ఆకాశమే హద్దు అన్నట్లుగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటి ఫలితంగా ఆయన బీజేపీ నుంచి సస్పెన్షన్ కి గురి అయ్యారు. ఇక్కడ చెడ్డ ఏమైనా ఉంటే ఆయన సస్పెన్షన్ వల్ల తొలగిపోతుందని, రాజకీయ లాభం ఏమైనా ఉంటే తనకు దక్కుతుందని బీజేపీ భావిస్తోంది.

అయితే బీజేపీ ఆయన్ని ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించలేదు. దాంతో మజ్లీస్ పార్టీ సహా విపక్షాలు ఇదే విషయం మీద డిమాండ్ చేస్తున్నాయి. ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతున్నాయి. అలా కనుక చేస్తే రాజా సింగ్ బీజేపీకి చెందవి వారు అవుతారు, ఆయన ఎమ్మెల్యే గిరి అయితే పోదు, ఇలా అటు పార్టీకి ఇటు రాజా సింగ్ కి కరెక్ట్ శిక్ష పడినట్లుగా ఉంటుంది అన్నది మజ్లీస్ ప్లాన్.

ఇక ఆయన మీద చర్యలు నేరుగా తీసుకునే అధికారం అవకాశం అసెంబ్లీ స్పీకర్ కి ఉంది. ఆయన కనుక తలచుకుంటే ఆయన్ని ఏకంగా అసెంబ్లీ నుంచి బహిష్కరించడమే కాదు సభ్యత్వం కూడా రద్దు చేయగలరు, కానీ అక్కడ టీయారెస్ ఆలోచనలు ఏంటో చూడాలి. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న వేళ రాజాసింగ్ సభ్యత్వం రద్దు చేస్తే ఉప ఎన్నిక తోసుకువస్తుంది. అసలే మునుగోడు తో అన్ని పార్టీలు మునిగీ తేలుతున్నాయి. ఇపుడు గోషా మహల్ ఉప ఎన్నిక అంటే తట్టుకోవడం కష్టమే అంటున్నారు.

పైగా అక్కడ బీజేపీకి పట్టుంది, వ్యాపారులు హిందువులు ఎక్కువగా ఉన్న అతి చిన్న ఈ నియోజకవర్గంలో ఎన్నిక అంటూ జరిగితే అది కూడా హిందూత్వ కార్డు మీద జరిగితే రాజా సింగ్ కే ప్రయోజనం అంటున్నారు. మరి ఇంత తెలిసాక అసలే దూకుడు మనిషిగా పేరున్న రాజా సింగ్ ఊరుకుంటారా. ఆయన తన పదవికి రాజీనామా చేసి పారేసి ఉప ఎన్నిక తేకుండా ఉంటారా. హిందూత్వ కార్డుని వీర లెవెల్ లో వాడుకుని తన పట్టుని నిరూపిస్తారు అన్న వారూ లేకపోలేదు.

ఇక రాజా సింగ్ కూడా ఒక మాట అంటున్నారు. తనకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు అని. అంటే బీజేపీ మనసెరిగి రాజా సింగ్ నడచుకుంటారు అనే కదా అర్ధం. ఇక ఈ రోజుకు బీజేపీతో సంబంధం లేనట్లుగా ఆయన వ్యవహరించినా రాజీనామా చేసి మళ్లీ నెగ్గితే అలా హిందూత్వ జెండా ఎగిరితే బీజేపీ కూడా మళ్లీ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఇది ప్రజా తీర్పు అని సమర్ధించుకునే చాన్సూ ఉంది. మొత్తానికి గోషా మహల్ కి ఉప ఎన్నికలు వచ్చేలాగే సీన్ కనిపిస్తోంది.

అయితే ఉప ఎన్నిక రావడం ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార టీయారెస్ కి కానీ, మజ్లీస్ కి కానీ ఇష్టం లేదు. మరి రాజా సింగ్ ప్లాన్ ఏంటో చూడాలి. అంత కంటే ముందు సస్పెండ్ చేసి ఊరుకున్న బీజేపీ ఆయన మీద ఇంకా ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో లేక మౌనం వహిస్తుందో కూడా చూడాలి. మొత్తానికి గోషా మహల్ కి ఉప ఎన్నిక రావచ్చు అన్న న్యూస్ అయితే ఇపుడు తెలంగాణాలో హల్ చల్ చేస్తోంది. చూడాలి ఈ వీర హిందూత్వ రాజా సింగ్ ఎలా పావులు కదుపుతారో.