Begin typing your search above and press return to search.

యూపీలో బైబై మోడీ హోర్డింగులు.. తర్వాతేం జరిగిందంటే?

By:  Tupaki Desk   |   13 July 2022 5:17 AM GMT
యూపీలో బైబై మోడీ హోర్డింగులు.. తర్వాతేం జరిగిందంటే?
X
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ మహానగరంలో జరగటం.. దీని కోసం బీజేపీ నేతలు పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయటం.. అందుకు భిన్నంగా తెలంగాణ అధికారపక్షం హోర్డింగులు మోడీ అండ్ కోకు దక్కకుండా చేసిన వైనం పెద్ద ఎత్తున వార్తలుగా మారటం తెలిసిందే.

కేంద్రంలో తమదే అధికారం అయినప్పటికీ.. తెలంగాణ అధికారపార్టీని ఏమీ చేయలేని పరిస్థితుల్లో.. ప్రధానికి వ్యతిరేకిస్తూ పెట్టిన హోర్డింగులపై ఎలాంటి చర్యా తీసుకోకపోవటం తెలిసిందే.

కట్ చేస్తే.. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కొన్ని చోట్ల.. హైదరాబాద్ లో మాదిరి బై బై మోడీ అంటూ హోర్డింగులు ఏర్పాటు చేయటమే కాదు.. గ్యాస్ బండ మీద పడిన భారన్ని తెలుపుతూ ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ తో పాటు బెలి రోడ్ లోని రిజర్వ్ పోలీస్ లైన్ కు సమీపంలో బై బై మోడీ అంటూ హోర్డింగులు ఏర్పాటు చేసిన వైనంపై యూపీ సర్కారు సీరియస్ అయ్యింది.

వెంటనే రంగంలోకి యూపీ పోలీసులు దిగటం.. ఈ హోర్డింగులకు కారణమైన ప్రింటింగ్ ప్రెస్ యజమానితో పాటు..ఈ హోర్డింగులు ఏర్పాటు చేయటానికి కారణమైన వ్యక్తితో పాటు అతడికి సాయంగా నిలిచిన మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కోలోనెల్ గంజ్ పోలీసులు. అంతేకాదు.. తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ కు చెందిన టీఆర్ఎస్ మద్దతుదారు సాయి కూడా ఈ హోర్డింగుల ఉదంతంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ఈ హోర్డింగులపై ఐపీఎస్ లోని 153బీ.. 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తెలంగాణలో బై బై మోడీ అంటూ పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేసినా ఎలాంటి కేసులు నమోదు కాలేదు కానీ..

అందుకు భిన్నంగా యూపీలోని యోగి రాజ్యంలో టీఆర్ఎస్ మద్దతుదారు ఏర్పాటు చేసిన హోర్డింగుల్ని తొలగించటమే కాదు.. అందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకొని.. బలమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.