Begin typing your search above and press return to search.

రాయలసీమ ఎత్తిపోతల బోగస్సా ?

By:  Tupaki Desk   |   1 Aug 2021 10:44 AM GMT
రాయలసీమ ఎత్తిపోతల బోగస్సా ?
X
అవుననే అంటున్నారు బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటి కన్వీనర్, మాజీ ఎంఎల్ఏ బైరెడ్డి రాజశేఖరరెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ అభివృద్ధి కోసం కాదని బైరెడ్డి ఫుల్లుగా ఫైరయ్యారు. ఆ ప్రాజెక్టంతా ఉత్త బోగసన్నారు. దానివల్ల రాయలసీమలో జరిగే అభివృద్ధి ప్రత్యేకంగా ఏమీ ఉండదంటు తీవ్రంగా మండిపోయారు.

రిజర్వాయర్లు లేకుండా ఉన్న ప్రాజెక్టుల కెపాసిటిని పెంచకుండా కొత్త ప్రాజెక్టులు కడతామంటే జనాలు ఎలా నమ్ముతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదే విషయాన్ని కేంద్రప్రభుత్వం కూడా గుర్తించినట్లు చెప్పారు. నీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు వైసీపీ, టీడీపీ రెండూ మోసం చేస్తునట్లు బీజేపీ ఎప్పటినుండో చెబుతోందన్న విషయాన్ని గుర్తుచేశారు.

శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టాన్ని మైనటైన్ చేయకుంటే రాయలసీమ ఎడారిగా మారిపోవటం ఖాయమని ఆందోళన వ్యక్తంచేశారు. 854 అడుగులకు నీటిమట్టం చేరుకునేంత వరకు తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు లేదని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధి జరగాలంటే అది ఒక్క ప్రధానమంత్రి నరేంద్రమోడి వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసమే కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం కృష్ణా నీటి యాజమాన్యం బోర్డు పరిధిలోకి తీసుకున్నట్లు చెప్పారు.

సీమ అభివృద్ది జరగాలంటే నీటి ప్రాజెక్టులు నిర్మించటం ఒకటే మార్గమన్నారు. ఏపి లేదా సీమ ప్రాజెక్టుల విషయమై కేసీయార్ అన్ని అభ్యంతరాలు చెబుతుంటే ఏపి ప్రభుత్వం తరపున ఏమీ మాట్లాడకపోవటం దారుణమన్నారు. తెలంగాణా నుండి వైఎస్ షర్మిల మాట్లాడుతున్న మాటలకు స్క్రిప్టు అమరావతిలోనే తయారవుతోందన్నారు. సుంకేసుల ప్రాజెక్టు కెపాసిటి పెంచకుండా, గుండ్రేవుల ప్రాజెక్టు కట్టకుండా రాయలసీమ అభివృద్ధి సాధ్యంకాదని బైరెడ్డి తేల్చేశారు.