Begin typing your search above and press return to search.

బైరెడ్డీ..ఇలాంటి నివాళి ఎక్కడ నేర్చుకున్నారండీ!

By:  Tupaki Desk   |   2 Sep 2019 2:34 PM GMT
బైరెడ్డీ..ఇలాంటి నివాళి ఎక్కడ నేర్చుకున్నారండీ!
X
దివంగత సీఎం - మహా నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆయనకు నివాళులు వెల్లువెత్తుతున్నాయి. తరతమ అన్న బేధం లేకుండా జనం కూడా పెద్ద ఎత్తున వైఎస్ కు నివాళి అర్పించారు. అయితే వైఎస్ కు నివాళి అర్పించేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సమయమే చిక్కడం లేదన్న విమర్శలు ఓ వైపు వెల్లువెత్తుతుంటే... అదే సమయంలో వైసీపీకి చెందిన ఓ యువ నేత అర్పించిన నివాళిపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. తనదైన మార్కు నివాళితో నెటిజన్లకు అడ్డంగా బుక్కైన ఆ నేత - నివాళి సందర్భంగా ఆయన ఏం చేశారన్న విషయాల్లోకి వెళ్లిపోదాం పదండి.

కర్నూలు జిల్లా నందికొట్కూరు పేరు వింటే బైరెడ్డి ఫ్యామిలీ పేరు వినిపిస్తుంది కదా. బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయారు గానీ... ఆయన సోదరుడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు అక్కడ రాజకీయం నడుపుతున్నారు. నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ డ్ కావడంతో ఎస్సీ నేతను ఎమ్మెల్యేగా నిలబెట్టేసిన బైరెడ్డి... నియోజకవర్గానికి తాను మాత్రం సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. మాట తీరుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న సిద్ధార్థ రెడ్డి చాలా తక్కువ కాలంలోనే మంచి పేరే సంపాదించారు. అదే ఊపుతో సోమవారం వైఎస్ వర్థంతిని పురస్కరించుకుని నందిరొట్కూరు పాతబస్టాండ్ పరిధిలోని వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించేందుకు ఆయన తన అనుచరులను వెంటేసుకుని వచ్చారు.

ఇక్కడి దాకా బాగానే యంగ్ తరంగ్ గా కనిపించే సిద్ధార్థ... నివాళి సందర్భంగానూ తనదైన స్టైల్ ను వీడరాదనుకున్నారో - ఏమో తెలియదు గానీ... కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకునే వైఎస్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అలా కళ్లకు నల్లటి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకునే వైఎస్ విగ్రహానికి దండేశారు. ఓ దండం కూడా పెట్టారు. అంతేనా... అక్కడితో ఆగకుండా అక్కడే నిలబడి తనదైన మార్కు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. ఈ వీడియోను సిద్ధార్థ అనుచరులే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా... దానిని చూనిన నెటిజన్లు సిద్ధార్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్లకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని నివాళి అర్పించడం మిమ్మల్ని చూసే నేర్చుకోవాలని కొందరు సెటైర్లు వేయగా... ఈ తరహా నివాళి ఎక్కడ నేర్చుకున్నారు రెడ్డి గారూ అంటూ మరికొందరు విరుచుకుపడ్డారు. మొత్తంగా నివాళి అర్పించే సమయంలో కనీసం పాటించాల్సిన పద్దతులు కూడా పాటించని సిద్ధార్థ రెడ్డి అడ్డంగా బుక్కైపోయారని చెప్పక తప్పదు.