Begin typing your search above and press return to search.

కొండారెడ్డి బురుజు సెంటర్ కు రమ్మన్నాడు

By:  Tupaki Desk   |   30 Sep 2015 4:41 AM GMT
కొండారెడ్డి బురుజు సెంటర్ కు రమ్మన్నాడు
X
ఓవైపు ఫ్యాక్షన్ కేసులు.. మరోవైపు రాజకీయాలు. ఇలాంటి కాంబినేషన్ లో తరచూ వార్తల్లోకి వచ్చే నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కర్నూలు జిల్లాకు చెందిన ఈ నేత రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట సొంత కుంపటి పెట్టుకొని తరచూ ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉంటూ.. కర్నూలు జిల్లా పార్టీ అధినేతగా వ్యవహరించి.. పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ఆయన ఇప్పుడు బాబు పరివారంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబుకు రైతుల పొడ అస్సలు గిట్టదంటూ తీవ్ర విమర్శలు చేసిన బైరెడ్డి.. చంద్రబుకు కానీ ఆయన మంత్రులకు కానీ దమ్ముంటే కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ వద్దకు రావాలని.. పట్టిసీమతో రాయలసీమను సస్యశామలం చేస్తామని చెబుతున్న అంశంపై చర్చకు వస్తారా? అని నిలదీస్తున్నారు.

పట్టిసీమ ద్వారా సీమకు లాభం అంటున్న అంశంపై తనతో బహిరంగ చర్చకు బాబు అండ్ కో లో ఎవరైనా రెఢీనా అని ప్రశ్నిస్తున్నారు. రైతుల్ని అస్సలు పట్టించుకోని చంద్రబాబు.. ఏసీ బస్సుల్లో తిరగటం విచిత్రంగా ఉందన్న బైరెడ్డి.. హంద్రీనీవా కాంట్రాక్టర్లంతా చంద్రబాబు చుట్టూనే తిరుగుతున్నారంటూ ఆరోపించారు. రైతులకు తెలీకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో రిలయన్స్ కంపెనీకి 5,500 ఎకరాల్ని కట్టబెట్టారంటూ ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా తాను అక్టోబరు 14 నుంచి 16 వరకు బతుకుతెరువు యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. తరచూ ఏదో ఒక అంశంపై ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహించే బైరెడ్డి.. తాజా బతుకుదెరువు యాత్ర ఏ రేంజ్ లో నిర్వహిస్తారో చూడాలి. ఇంతకీ.. బైరెడ్డి సవాలుకు తమ్ముళ్లు రియాక్ట్ అవుతారా..?