Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు దెయ్యం పట్టింది

By:  Tupaki Desk   |   27 Oct 2015 10:27 AM GMT
చంద్రబాబుకు దెయ్యం పట్టింది
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు దెయ్యం పట్టిందని, అందుకే ఇలా పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు కురిపించారు. చంద్రబాబు ప్రభుత్వానికి అమరావతి దెయ్యం పట్టిందని బైరెడ్డి అన్నారు.

రాజధాని అమరావతిని, అందుకోసం కలలు కంటున్న చంద్రబాబును టార్గెట్ చేసి బైరెడ్డి మాటల తూటాలు పేల్చారు. 13 జిల్లాలున్న ఏపీకి 2 లక్షల ఎకరాల్లో రాజధాని అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ ఆదేశాలను పాటించకుండా చంద్రబాబు సర్కారు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిందని ఆరోపించారు. సర్కారు తీరుపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తిని మభ్యపెట్టి లోబర్చుకునేందుకు చంద్రబాబు వద్ద ఉన్న మంత్రులు ప్రయత్నించారని బైరెడ్డి మండిపడ్డారు.

అమరావతికి శంకుస్థాపన చేసిన రోజు(అక్టోబరు 22) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చీకటి రోజని బైరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, తన రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో ఉండడంతో బైరెడ్డి రోజుకోరకంగా మారుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. చంద్రబాబుతో విభేదించి టీడీపీని వీడిన ఆయన అనంతరం పలు కేసుల్లో ఇరుక్కుని ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఆ తరువాత మళ్లీ టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేసినా స్థానిక టీడీపీ నేతలు ఆయన్ను రాకుండా అడ్డుకున్నారు. అలా అని వైసీపీ, కాంగ్రెస్ పార్టీల్లోకీ వెళ్లే పరిస్థితి లేదు. బైరెడ్డి ఇప్పుడు రాజకీయ నడిసంద్రంలో ఉన్నారు. దీంతో రాయలసీమకు రాజధాని దక్కలేదన్న కారణం చూపుతూ ప్రభుత్వంపై, చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు.