Begin typing your search above and press return to search.

స్వాములోరి కంటే గట్టిగా శపించేసిన బైరెడ్డి

By:  Tupaki Desk   |   6 July 2016 10:15 AM GMT
స్వాములోరి కంటే గట్టిగా శపించేసిన బైరెడ్డి
X
వివాదాస్పద వ్యాఖ్యలకు.. చేతలకు కేరాఫ్ అడ్రస్ అయి తరచూ మీడియాలో కనిపించే కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. బెజవాడలో గుళ్లు కూల్చేసిన ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. పవిత్రమైన గుళ్లను కూల్చేసిన చంద్రబాబుకు కష్టాలు తప్పవంటూ జోస్యం చెప్పిన ఆయన.. ఈ సందర్భంగా ఓబుళాపురం మైనింగ్ కోసం సుంకులమ్మ గుడిని కూల్చిన గాలి జనార్దనరెడ్డి ఉదంతాన్ని గుర్తు చేశారు.

ఆలయాల జోలికి వెళ్లిన ఏ నాయుడు బాగుపడలేదన్న బైరెడ్డి.. మైనింగ్ కోసం సుంకులమ్మ గుడిని కూల్చిన గాలి జనార్దనరెడ్డి జైలుకు వెళ్లారన్న ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు చైనాలో పర్యటిస్తూ.. విజయవాడలో పుష్కరాల కోసం దేవాలయాల్నికూల్చివేయటం దుర్మార్గమన్నారు. చైనా పర్యటనలతో ముఖ్యమంత్రికి బైద్దమతం మీద వ్యామోహం పెరిగిందా? అని ప్రశ్నించారు. విజయవాడలో దేవాలయాల కూల్చివేతతో దివంగత ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా పుష్కరాలను పవిత్రంగా నిర్వహించాల్సింది పోయి.. పట్టిసీమ వద్ద గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లించి పుష్కర హారతులు ఇస్తామని చెప్పటం ఏమిటన్నారు. ‘‘ఇప్పుడు జరిగేవి కృష్ణా పుష్కరాలా? గోదావరి పుష్కరాలా? సీఎం చంద్రబాబుకు తానేం చేస్తున్నానన్న విషయం మీద అవగాహన ఉందా?’’ అంటూ నిలదీశారు. బైరెడ్డి వ్యాఖ్యలు చూసినప్పుడు చంద్రబాబును స్వాములు సైతం ఇంత ఘాటుగా విమర్శించలేదేమో? అనిపించక మానవు.