Begin typing your search above and press return to search.

మరే నేత చెప్పని రీతిలో జగన్ కు బైరెడ్డి బర్త్ డే విషెస్

By:  Tupaki Desk   |   20 Dec 2021 6:10 AM GMT
మరే నేత చెప్పని రీతిలో జగన్ కు బైరెడ్డి బర్త్ డే విషెస్
X
ఏపీ రాజకీయాల్లో కొత్త తరం నేతలు వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు యువ నేతలు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఎక్కువ మంది రాజకీయాల్ని వారసత్వంగా చేసుకొని వచ్చిన వారే. తక్కువ వ్యవధిలో తనదైన మార్కు వేసుకోవటమే కాదు.. యూత్ లో మాంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నేతల్లో కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఒకరు. సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే విజయంలో బైరెడ్డి కీలక భూమిక పోషించారు.

కమిట్ మెంట్ కు మారుపేరుగా.. ఆవేశానికి కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరించే అతగాడిని సీఎం జగన్ సైతం అభిమానిస్తారు. ఆయన్ను తన తమ్ముడిగా సీఎం జగన్ చెప్పటం తెలిసిందే. ఈ కారణంతోనే.. పార్టీకి ఆయన అందించే సేవల్ని ప్రాతిపదికగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ గా ఎంపిక చేశారు. దీంతో.. వైసీపీలో బైరెడ్డికి దక్కిన గుర్తింపునకు నిదర్శనంగా ఈ పదవిని చెబుతుంటారు.

మరో రోజు గడిస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజును గ్రాండ్ గా నిర్వహించాలన్న యోచనలోపార్టీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అయితే విశాఖలో వైఎస్సార్ కప్ క్రికెట్ 2021 టోర్నీని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఇలా ఎవరికి వారు.. తమకు తోచిన రీతిలో జగన్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటివేళ.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాత్రం రోటీన్ కు భిన్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేలా చేశారు. విశాఖలోని రుషికొండలో స్కూబా డైవింగ్ చేసిన ఆయన.. సముద్రం లోతుల్లోకి వెళ్లి ముఖ్యమంత్రికి ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. పార్టీ నేతలు ఎంతమంది ఉన్నా.. అధినేత మీద తనకున్న అభిమానాన్ని మిగిలిన వారికంటే భిన్నంగా చెప్పిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.