Begin typing your search above and press return to search.

క‌ర్నూలు వైసీపీలో క‌ల‌క‌లం.. పార్టీ మారుతున్న కీల‌క నేత‌?

By:  Tupaki Desk   |   20 April 2022 1:51 PM GMT
క‌ర్నూలు వైసీపీలో క‌ల‌క‌లం.. పార్టీ మారుతున్న కీల‌క నేత‌?
X
నిన్నటి వ‌ర‌కు నెల్లూరు రాజ‌కీయాలు అధికార వైసీపీలో తీవ్ర క‌ల‌వ‌రం.. క‌ల‌క‌లం సృష్టించిన విష‌యం తెలిసిందే. మాజీ మంత్రి అనిల్ వ‌ర్సెస్ ప్ర‌స్తుత మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిల మ‌ధ్య రాజుకున్న రాజ‌కీయ ఆధిప‌త్య హోరు.. తీవ్ర‌స్థాయికి చేరి.. స‌వాళ్ల వ‌ర‌కు వెళ్లింది. ఫ్లెక్సీలు చింపుకునే దాకా వ‌చ్చింది. ఈ వివాదాల నుంచి పార్టీ ఇంకా బ‌య‌ట‌కు రాక‌ముందే.. ఇప్పుడు మ‌రో వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. అది కూడా నెల్లూరు మాదిరిగానే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లా. ఇక్క‌డి రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గం నందికొట్కూరులో పార్టీ బాధ్య‌త‌లు చూస్తున్న యువ నాయ‌కుడు.. బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి చుట్టూ రాజ‌కీయాలు ముసురుకున్నాయి.

కర్నూలు వైసీపీలో యువ నేత‌ సిద్ధార్థరెడ్డి ప్రకంపనలు రేపుతున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాదికార సంస్థ కార్పొరేష‌న్‌కు చైర్మ‌న్‌గా ఉన్న సిద్ధార్థ‌రెడ్డి వాస్త‌వానికి జ‌గ‌న్ అధికారంలోకి రాక‌ముందు నుంచి పార్టీలో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఆయ‌న పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే ఆర్ధ‌ర్‌పై పైచేయి కోసం.. ఆయ‌న ప్రయ‌త్నాలు చేశారు. ఎమ్మెల్యే కంటే.. ఎక్కువ‌గా.. అధికారుల‌ను అదిలించ‌డం.. ప‌నులు చేయించ‌డం వంటివాటితో సిద్ధార్థ రెండేళ్లుగా వార్త‌ల్లో ఉన్నారు. అయితే.. అలాంటి నాయ‌కుడు గ‌త‌ కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు.

నందికొట్కూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్ధర్‌తో ఆయనకు విభేదాలున్న‌ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పార్టీ వీడుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే.. నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీల‌కు రిజ‌ర్వ్ అయింది. దీంతో ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం లేదు. ఎంత ఊపు తెచ్చినా.. ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌దు.

ఈ నేప‌థ్యంలో ఏదోఒక నియోజ‌క‌వ‌ర్గం ఇవ్వాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ క్ర‌మంలో శాప్ చైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చారు. కానీ, ఆయ‌న సంతృప్తి చెంద‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కావాల‌ని.. డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధిష్టానం నుంచి ఎలాంటి క‌బురు లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలావుంటే.. సిద్ధార్థ రెడ్డి.. ఇటీవల టీడీపీ యువ నాయ‌కుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌తో సమావేశమయ్యాడంటూ.. వైసీపీ అధిష్టానం దృష్టికి బైరెడ్డి వ్యతిరేక వర్గం తీసుకెళ్లింది. సిద్ధార్థ్ రెడ్డిని మొదటినుంచి జిల్లా ముఖ్యనేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌లు పోతున్నార‌ని.. పేర్కొంటూ.. సిద్ధార్థ్ రెడ్డి వ్యవహారంపై వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ మారుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన టీడీపీ నేత నారా లోకేష్‌ను కలిశారని త్వరలో టీడీపీలో చేరుతారని వైసీపీ ముఖ్య నేత‌లే అంటున్నారు.

అయితే.. పార్టీ మారుతున్నార‌న్న ప్రచారాన్ని సిద్ధార్థ్ రెడ్డి కొట్టిపారేశారు. పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఇది కావాలని కొంతమంది చేస్తున్న కుట్ర చేస్తున్నారని, కుట్ర చేస్తున్నది ఎవరో తొందరలోనే బయటపడుతుందని సిద్ధార్థ్‌రెడ్డి తెలిపారు. ప్ర‌స్తుతం ఈ వివాదం జిల్లాలో వైసీపీకి త‌ల‌నొప్పిగా మారింది. బ‌ల‌మైన రెడ్డి వ‌ర్గానికి చెందిన యువ నేత కావ‌డంతో ఏం చేయాలో తెలియ‌క అధిష్టానం త‌ల‌ప‌ట్టుకుంద‌ని అంటున్నారు సీనియ‌ర్ నేత‌లు