Begin typing your search above and press return to search.

పోలీసులకు మస్కా కొట్టిన మాజీ మంత్రులు

By:  Tupaki Desk   |   7 Feb 2016 10:08 AM GMT
పోలీసులకు మస్కా కొట్టిన మాజీ మంత్రులు
X
కాపు గర్జన సందర్భంగా చెలరేగిన హింసకు కారణమైనవారు... ఆ రోజు గర్జన సభ వేదికపై ఉన్నవారిపై పోలీసులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులున్నవారిని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష వద్దకు అనుమతించడం లేదు. కిర్లంపూడి కి వచ్చేమార్గాల్లో ఏర్పాటుచేసిన చెక్ పోస్లుల నుంచే నాయకులను తిప్పి పంపించేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు. ఒక్కోసారి ఆ ప్రయత్నంలో సఫలమవుతున్నారు... ఒక్కోసారి నాయకుల డామినేషన్ తో విఫలమవుతున్నారు.

అయితే... కిర్లంపూడిలో ముద్రగడను కలిసేందుకు వచ్చిన మండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య మాత్రం కొత్త ఎత్తుగడతో కిర్లంపూడిలోకి వచ్చారని తెలుస్తోంది. కారు - గన్ మెన్ల హడావుడితో వెళ్తే పోలీసులు అడ్డుకుంటారని భావించి... మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ - ఆయన కలిపి కొద్ది మంది అనుచరులతో మోటార్ సైకిల్ పై కిర్లంపూడిలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. చెక్ పోస్టు వద్ద అడ్డుకోవడంతో జాగ్రత్తగా అడ్డదారిలో వారు ముద్రగడ నివాసానికి చేరుకున్నారట. అయితే... అక్కడా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. వారిని లోనికి పంపించాలంటూ ముద్రగడ కూడా ఆగ్రహించడంతో పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో వారిని ముద్రగడ ఇంట్లోకి అనుమతించారు.

ముద్రగడ దీక్ష నేపథ్యంలో కిర్లంపూడిలోనే కాకుండా తూర్పుగోదావరి జిల్లామొత్తం పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం తొలగడం లేదు.