Begin typing your search above and press return to search.

ఓటుకు నోటులోకి కేసీఆర్ నూ లాగారు

By:  Tupaki Desk   |   2 Sept 2016 3:37 PM IST
ఓటుకు నోటులోకి కేసీఆర్ నూ లాగారు
X
అధికారపక్షంపై విరుచుకుపడే ఏ చిన్న అవకాశాన్ని విపక్షం వదిలిపెట్టదు. రాష్ట్రాధినేతను ఇరుకున పెట్టే ఛాన్స్ వస్తే ఏ రాజకీయ ప్రత్యర్థి మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోరు కదా. అలా వచ్చిన అవకాశం వచ్చినట్లే వచ్చి.. జస్ట్ మిస్ అయినట్లుగా పోవటం ఏపీ విపక్షాలకు మింగుడుపడని పరిస్థితి. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ1గా చేర్చాలంటూ ఈ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ప్రైవేటు ఫిర్యాదుచేయటం.. దీనిపై ఏసీసీ కోర్టు స్పందించి.. సమగ్ర దర్యాప్తు చేయాలని కోరటం తెలిసిందే.

ఏడాది క్రితం సంచలనం సృష్టించి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన ఓటుకు నోటు కేసు ఒక్కసారిగా వెలుగులోకి రావటంతో విపక్షాలు అలెర్ట్ అయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రిపై విరుచుకుపడటం షురూ చేశాయి. ఇదిలా ఉంటే.. ఓటుకు నోటు వ్యవహారంపై తనను టార్గెట్ చేసిన విపక్షాలకు సమాధానం చెప్పాలన్న రీతిలో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా ఈ వ్యవహారాన్ని విచారించిన హైకోర్టు.. ఏపీ ముఖ్యమంత్రిని ఏ1గా చేర్చాలన్న ఫిర్యాదుపై స్టే జారీ చేశారు.

ఓటుకునోటు కేసులో చంద్రబాబు ఫిక్స్ అవుతారని భావించిన విపక్షాల ఆశలకు హైకోర్టు తాజా ఆదేశం కళ్లాలు వేయటంతో విపక్షాలు మరోసారి గొంతు విప్పాయి. కోర్టు ఆదేశాలపై మాట్లాడని వారు.. కొత్త లాజిక్కును తెరపైకి తీసుకొచ్చారు. ఓటుకు నోటు కేసులో ఏ తప్పూ చేయకుంటే.. సీఎం చంద్రబాబు స్టే కోసం హైకోర్టుకు ఎందుకు వెళ్లారంటూ ప్రశ్నిస్తున్నా ఏపీ శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత సి. రామచంద్రయ్య. ఈ కేసులో బయటకు వచ్చిన ‘‘మా వాళ్లు బ్రీఫ్ డ్ మీ’’ ఆడియో టేపులో వినిపించిన గొంతు తనది కాదని చంద్రబాబు ఏ రోజూ చెప్పలేదన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. బాబు హైకోర్టుకు వెళ్లటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబుపై విరుచుకుపడిన రామచంద్రయ్య మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

రాజ్ భవన్ రాజీ భవన్ గా మారిందని.. ఏపీ సీఎం.. తెలంగాణ ముఖ్యమంత్రి మధ్య నడుమ గవర్నర్ రాజీ చేశారని.. ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి ఓటుకు నోటు కేసు విచారణను ఆపేశారన్నారు. ఇప్పటివరకూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండగా.. రామచంద్రయ్య ఆరోపణలతో ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావన రావటం గమనార్హం. రామచంద్రయ్య మాటలపై టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.