Begin typing your search above and press return to search.

పవన్ వాడేస్తున్నాడంటున్న పాత మిత్రుడు!

By:  Tupaki Desk   |   14 Feb 2018 2:35 PM GMT
పవన్ వాడేస్తున్నాడంటున్న పాత మిత్రుడు!
X
సి.రామచంద్రయ్య అంటే కడప జిల్లానుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యంత సీనియర్లలో ఒకరు. తెలుగుదేశం - ప్రజారాజ్యం - కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లోను అనుభవం ఉన్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే.. అనేక సమీకరణాల రీత్యా.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి రాజకీయ ఆప్తుల్లో ఒకడు. ఆయన ప్రజారాజ్యం పార్టీకి మేధో మూలస్తంభాల్లో ఒకడు. ఆ రకంగా అప్పటి యువరాజ్యం అధినేత పవన్ కల్యాణ్ కు కూడా ఆయన పాతమిత్రుడే. అయితే ఇప్పుడు ఈ సీనియర్ నాయకుడు పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలగురించి భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ అసలు జెఎఫ్‌ సి అనే దానిని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని సి.రామచంద్రయ్య వ్యాఖ్యానిస్తున్నారు. మేధావులను పవన్ ఈ రకంగా వాడుకోవడం తగదని హెచ్చరిస్తున్నారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం గురించి ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. ఒకప్పుడు ప్రత్యేకప్యాకేజీ అనౌన్స్ అయిన తర్వాత.. దేశంలో మరే రాష్ట్రానికి దక్కనన్ని నిధులు తానే తీసుకువస్తున్నానంటూ చంద్రబాబునాయుడు చెప్పలేదా అని నిలదీస్తున్న సి.రామచంద్రయ్య.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ నిందలు వేసే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకే లేదని అంటున్నారు. తనపై ఉన్న కేసుల వల్లనే కేంద్రం వద్ద లొంగిపోయిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారనే వాదన సర్వత్రా వినిపించేదే. అదే విషయాన్ని మళ్లీ ప్రస్తావించిన సి.రామచంద్రయ్య ఈ వాదనకు బలంగా.. మరో సంగతి కూడా అదనంగా జత చేస్తున్నారు. విపక్షాలు ఎన్ని సార్లు డిమాండ్ చేసినా కూడా.. చంద్రబాబునాయుడు రాష్ట్రానికి దక్కవలసిన వాటి గురించి కేంద్రాన్ని ప్రశ్నించడానికి ఒక్కసారి కూడా అఖిలపక్ష కమిటీని ఢిల్లీ తీసుకువెళ్లలేదని.. అలాంటి ప్రయత్నం చేసి ఉంటే గనుక.. ఖచ్చితంగా తొలినాళ్లలోనే కేంద్రమ మీద వత్తిడి వచ్చి ఉండేదని.. ఇప్పుడు ఇలా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ.. మిత్రపక్షాలే అయినా కలహాల కాపురం నడిపించే అవసరం ఉండేది కాదని ఆయన పేర్కొంటున్నారు. చంద్రబాబు ఒకప్పట్లో విపరీతంగా కీర్తించిన ప్రత్యేక ప్యాకేజీ అనేది ఓ ‘అరుంధతి నక్షత్రం’ లాంటిదని ఆయన నిర్వచించడమే తమాషా. కొత్త దంపతులకు అరుంధి నక్షత్రం అంటూ చూపిస్తారు గానీ.. అదెక్కడా వారికి కనిపించదు. అలాగే కొత్త రాష్ట్రానికి ప్యాకేజీని చూపించి పబ్బం గడిపేస్తున్నారే తప్ప.. అది ఆచరణలో ఉండేది కాదని.. రామచంద్రయ్య ఆరోపించడం విశేషం.

మొత్తానికి పవన్ కు తాను చేస్తున్న పనిలో తనకే క్లారిటీ లేదని, కన్ఫ్యూజన్ లో ఉన్నారని అందరూ అంటూ ఉంటారు. చూడబోతే ఆయన పనిని చూసిన అందరూ కూడా కన్ఫ్యూజన్ కు గురవుతున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.